May 03,2023 23:09

వర్షపునీరు, మురుగునీటితో నిండిపోయిన శ్యామలాసెంటర్‌ రోడ్డు

వదలని వాన
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లాను వాన వదలట్లేదు. బుదవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జిల్లా వ్యాప్తంగా వర్షం పడింది. రాజమహేంద్రవరంలో కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్యామలా సెంటర్‌ వరద్ద వర్షపునీటితో మురుగునీరు కలిపోయి రోడ్డుపైకి చేరింది. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. మెయిన్‌ రైల్వేస్టేషన్‌, కంబాల చెరువులు, నల్లాచానల్‌, సీతంపేట ప్రాంతాల్లో మోకాల్లోతు వర్షపునీరు నిలిచిపోయింది. రాజమహేంద్రవరం రూరల్‌, కడియం ప్రాంతంలో కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. నర్సరీల్లోకి వర్షపు నీరు చేరింది. గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు, పెరవలి ప్రాంతాల్లో వరి చేలల్లోకి నీరు చేరింది. పలుచోట్ల వరి పంట నేలకొరిగింది. కళ్లాల్లో ఉన్న ధాన్యపురాసులు తడిసి ముద్దయ్యాయి. పనలపై ఉన్న పంటూ పూర్తిగా తడిసిపోయింది. మూడురోజులుగా తడవడంతో పలుచోట్ల పనలకు మొలకలు వచ్చాయి. పంట చేతికొచ్చేవేళ వర్షాలతో పూర్తిగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.