ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి భానుడి భగ భగలు రోజు రోజుకూ అధిక మవుతున్నాయి. మంగళవారం 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోహిణీకార్తె ముగిసినప్పటికీ ఎండలు తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. నదీ తీర ప్రాంతాలలో వేడి గాడ్పులు మరింత హీటెక్కిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే సందేహిస్తున్నారు. జిల్లాకేంద్రమైన రాజమహేంద్రవరంలో వారం రోజులుగా ఉదయం 11 గంటలకే నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పుష్కర్‌ఘాట్, దేవీచౌక్, మెయిన్ రోడ్లు వెలవెల బోతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకూ ఖాళీగా రహదారులు దర్శనమిచ్చాయి. మరోవైపు వడగాల్పులు ప్రతాపం చూపిస్తున్నాయి. 10 రోజులుగా అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. జిల్లా అంతటా 43-44 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏటా వరదల సమయంలో నదీ తీర ప్రాంతానికి ఇసుక మేటలు చేరుతున్నాయి. వేసవి నేపథ్యంలో నదిలో నీటి శాతం తగ్గిపోవడంతో సూర్యకిరణాల వేడికి ఇసుక త్వరగా వేడెక్కుతోంది. గాల్పులకు ఆ వేడి తిరిగి నది పరీవాహక ప్రాంతాలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయి. గడిచిన వారం రోజులలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మరో వైపు వడగాల్పులు అధికమయ్యాయి. గురువారం 40.01 శుక్రవారం 43.41 శనివారం 41.12, ఆదివారం 42.40 సోమవారం 41.36 మంగళవారం 43.21 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బ లక్షణాలు
ఎండలో ఎక్కువ సేపు ఉంటే తల తిరగడం, తలనొప్పి, సొమ్మసిల్లి పడిపోయే లక్షణాలు ఉంటాయి. నాలిక పొడిబారిపోయినట్లు అనిపించడం గుర్తించవచ్చు. ఈ దశలో రక్త నాళాలు వ్యాకోచించి మెదడుకు సరిగ్గా రక్తం అందదు. ఈ పరిస్థితిని హీట్ సింకోప్ అంటారు. ఇది వడదెబ్బకు దారి తీస్తుంది. రాత్రివేళలో కాలిపిక్కలు పట్టేసినట్లు, తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా పిల్లల్లో, పెద్దల్లో వస్తుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలో లవణాలు కోల్పోవడం వల్ల కండరాలకు మెదడు నుంచి ఆదేశాలు సరిగ్గా అందవు. స్పృహ తప్పిపోయే ప్రమాదమూ ఉంది. ఈ వేసవిలో వడదెబ్బ తగిలినట్లు గుర్తిస్తే నీళ్లు, ఒఆర్‌ఎస్ ద్రావణాన్ని తాగిస్తే ఫలితం ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లకూడదు. ఏదైనా పని ఉంటే ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 4 తర్వాత చేసుకునేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. చేపలకు ప్రాధాన్యం ఇవ్వాలి.- మద్యం, సిగరెట్, బిర్యానీలు, మసాలాలు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు సంభవించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
వేసవి నేపథ్యంలో వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ తాగాలి. ఎండలో తిరిగినప్పుడు చెమటతోపాటు శరీరంలోని ఎలక్ట్రోరల్స్ కూడా బయటకుపోతాయి. కావున ఒఆర్‌ఎస్ నీళ్లు, ఉప్పు వేసిన నిమ్మరసం తాగాలి. రోజుకు 3 లీటర్లు కనీసం మంచినీళ్లు తాగాలి. పుచ్చకాయ, నిమ్మకాయ, కీరదోసలు ఎక్కువగా తినాలి. అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లయితే వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలి. తక్షణమే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి.










