ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
టిడిపి మహానాడు విజయవంతంతో వైసిపి గుండెల్లో గుబులు ప్రారంభమైందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శిష్ట్ల లోహిత్ అన్నారు. అర్బన్ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌టిఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయన్నారు. మహానాడు ముగింపు సభలో తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తొలిదశ ఎన్నికల మేనిఫెస్టోతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆలోచనను రేకిత్తిస్తున్నాయని చెప్పారు. మహిళలు, రైతులు, యువత, బిసి సామాజికవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బాబు చెప్పారన్నారు. జగన్ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, అందుకే ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమై వ్యతిరేకతో ఉన్నారన్నారు. మహానాడు సందర్భంగా టిడిపి జెండాలు, ఫ్లెక్సీల మధ్య వైసిపి ఫ్లెక్సీలు, జెండాలు కట్టి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. దీనిపై ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పకుండా కొందరు వైసిపి నాయకులు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తాను ఏం చేసినా అది పూర్తిగా తమ పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంచే చేస్తానన్నారు. ఎవరి హద్దుల్లో వారు ఉంటే అందరికీ మంచిదన్నారు. మహానాడు నేపథ్యంలో నగరంలో అలంకరణ బాధ్యతను పార్టీ అధిష్టానం తనకు అప్పగించిందని, అందుకు అనుగుణంగానే పనిచేశానని లోహిత్ అన్నారు. అనంతరం టిడిపి రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడారు. మహానాడు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బొర్రా చిన్ని, కడలి రామకృష్ణ, కంటిపూడి రాజేంద్రప్రసాద్, సలాది ఆనంద్ పాల్గొన్నారు.










