May 30,2023 23:23

రాజానగరంలో గణేష్‌ఆధ్వర్యంలో బైకు ర్యాలీ

ప్రజాశక్తి - యంత్రాంగం
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అయిన సందర్భంగా వైసిపి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నిడదవోలు పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌నాయుడు పార్టీ గుర్తుతో ఉన్న భారీ కేకును కట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమసమాజాన్ని నిర్మించే పనిలో సిఎం జగన్‌ ఉన్నారన్నారు. అభివద్ధి, సంక్షేమం అంటే ఏంటో చేతల్లో చేసి చూపిన నేతగా జగన్‌ చరిత్రలో నిలిచారని కొనియాడారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే టిడిపి, జనసేన పార్టీలకు అవి కనిపించట్లేదన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా జగన్‌ను ప్రజలు ఆదరించటానికి సిద్ధంగా ఉన్నారన్నారు..కొవ్వూరు రూరల్‌ మంత్రి క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో హోం మంత్రి తానేటి వనిత నాలుగేళ్ల విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. భారీ కేక్‌ కట్‌ చేసి పంచారు. అనంతరం ఆమె మాట్లాడారు. అంబేద్కర్‌, పూలే, జగజ్జీవన్‌రామ్‌ ఆశయాలకు అనుగుణంగా జగన్‌ అందిస్తున్న సుపరిపాలనకు నాలుగేళ్లు పూర్తయిందన్నారు. జగన్‌ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు అండగా ఉన్నారన్నారు. పేదలకు ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తున్నారన్నారు. విద్యార్థులు, రైతులు, మహిళలు అన్నిరంగాల్లో వారికీ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడుపుతున్నారన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనూ ఎక్కడా సంక్షేమం మాత్రం ఆగలేదన్నారు. 98శాతం హామీలను అమలు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం విఎల్‌పురంలోని ఎంపీ కార్యాలయంలో వైసిపి నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. భారీ కేక్‌ కట్‌ చేశారు. సిఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 'థాంక్యూ సిఎం సార్‌, థాంక్యూ జగనన్న' అంటూ నాయకులు, కార్యకర్తలు నినదించారు. అనంతరం విజయోత్సవ సభలో అడపా శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇది పార్టీ కార్యక్రమం కాదని వైసిపి పండుగ అని అన్నారు. టిడిపి మహానాడులో చంద్రబాబు మినీ మ్యానిఫెస్టో పేరుతో విడుదల చేసిన సంక్షేమ పథకాలన్నీ తమ పార్టీవేనని అన్నారు. ఈ సమావేశంలో మార్గాని సురేష్‌, నక్కా నగేష్‌, పిల్లి నిర్మల, మార్తి లక్ష్మి, లక్ష్మణరావు, మజ్జి అప్పారావు, పీతా రామకృష్ణ, బర్రే కొండబాబు, గూడాల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజానగరంలో వైసిపి నాయకులు జక్కంపూడి గణేష్‌ ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ జగన్‌ రాష్ట్రంఓ సంక్షేమ విప్లవం తీసుకొచ్చారన్నారు. ఎంఎల్‌ఎ రాజా ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంతగా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ దూలం పెద్ద, జడ్‌పిటిసి సభ్యులు వాసంశెట్టి పెద్దవెంకన్న, ఎం.వీర్రాజు, జి.సోమేశ్వరరావు, ఎ.చినబాబు తదితరులు పాల్గొన్నారు