Feb 16,2023 23:35


ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి, సామర్లకోట సహజ సంపదను దోచేస్తూ, ధరలను పెంచుతూ, కుంభకోణాలు చేస్తూ వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో గురువారం ఆయన పర్యటించారు. జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో రోడ్‌ షో నిర్వహించారు. పెద్దాపురం డైలీ మార్కెట్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఒక సైకో పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాడు విభజన కష్టాల్లో సైతం విద్యుత్‌ ఛార్జీలు పెరగలేదని, నేడు ఏడుసార్లు విద్యుత్‌ ధరలు పెంచారని చెప్పారు. వైసిపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ భారీగా పెరిగాయన్నారు. 48 రకాల పన్నులు వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గోదావరి జిల్లాలో కూడా ఇసుక ఎందుకు దొరకడం లేదో ప్రజలు గమనించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదాట్లో కలిపేశాడన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కి పోయాయని, భారీగా ఉపాధి అవకాశాలు తగ్గడంతో యువత వేరే రాష్ట్రాలకు వలస పోతున్నారన్నారు. మళ్లీ ఉద్యోగాలు రావాలంటే టిడిపి తోనే సాధ్యమన్నారు. కేంద్రం రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేస్తే నాలుగేళ్లలో జగన్‌ 823 ఇళ్లు మాత్రమే కట్టించారని, పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలో రూ.6 వేల కోట్ల అక్రమాలు చేశారని విమ ర్శించారు. కాకినాడ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో బియ్యం మాఫియా నడుస్తోంద న్నారు. కాకినాడ పోర్టు భూములు రాయించుకున్నారన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల తోకలు కట్‌ చేస్తానని హెచ్చరించారు. పెద్దా పురంలో ఎంఎల్‌ఎ చిన రాజప్ప రూ.1500 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారని, ఇక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ ఆయన డిప్యూటీ సిఎంగా ఉండి కట్టించినవేనన్నారు. వైసిపి వచ్చిన తర్వాత సామర్లకోట షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. ఇళ్ల స్థలాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం
టిడిపి స్థాపించినప్పటి నుంచి కార్యకర్తలే పార్టీకి బలమని చంద్రబాబు అన్నారు. జగ్గంపేటలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పార్టీ పురోగతి కంటే జగ్గంపేటలోని ఒక ప్రత్యేక స్థానం ఉంద న్నారు. 2500 మంది కార్యకర్తలు జ్యోతుల నెహ్రూ కను సన్నల్లో క్రమశిక్షణగా మెలుగుతున్నారని అభినందించారు. ప్రతి గ్రామంలో 25 నుంచి 30 కుటుంబాలకు సాధికార సారధిగా కార్యకర్తలు మారాలన్నారు. కార్యక్ర మంలో మాజీ హోమ్‌ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. మూడోసారి కూడా పెద్దాపురం ఎంఎల్‌ఎ టికెట్‌ చినరాజప్పకే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తొలుత పెద్దాపురంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. జగ్గంపేట నుండి ప్రారంభమైన చంద్రబాబు యాత్ర పెద్దాపురం గుర్రాల పార్క్‌ సెంటర్‌ వద్దకు వచ్చేసరికి క్రేన్లతో గజమాలను వేశారు. అనం తరం గుర్రాల పార్క్‌ సెంటర్‌ నుండి దర్గా సెంటర్‌ మీదుగా పెద్దాపురం డైలీ మార్కెట్‌ రోడ్డులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతరం సామర్లకోట ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద పట్టణ అధ్యక్షులు అడబాల కుమార స్వామి, కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్‌ సెంటర్‌ మీదుగా దక్కన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. చంద్రబాబు సభకు హాజరయ్యేందుకు పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌్‌ ఎస్‌విఎస్‌ ఎన్‌.వర్మ ఆధ్వర్యంలో సుమారు 3 వేల మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు బైకులపై ర్యాలీగా తరలి వెళ్లారు.