పోలీసుల అదుపులో నిందితుడు
పాత కక్షలే కారణంగా ప్రాథమిక నిర్ధారణ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
మాజీ కార్పొరేటర్, 44వ వార్డు వైసిపి ఇన్‌ఛార్జి బూరాడ కృష్ణకుమారి భర్త భవాని శంకర్(58) తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం భవానీశంకర్ అతని భార్య కృష్ణకుమారితో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. మధ్యాహ్నాం 3.30 గంటలకు ఇంటికి వచ్చారు. భోజనం కోసం ఇరువురూ హాల్లో కూర్చొన్నారు. అప్పటికే వారిని పీత అజరు బైకుపై వెంబడిస్తూ వచ్చాడు. మాట్లాడాలని భవానిశంకర్‌ను బయటకు పిలిచాడు. ఈ సమయంలో అజరు వెనుక కత్తి ఉండటాన్ని భార్య కృష్ణకుమారి గమనించింది. వెంటనే భర్తను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. ఈలోగానే అజరు కత్తితో భవానిశంకర్‌ను పొడిచి బైకుపై పరారయ్యాడు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. తీవ్రంగా గాయపడిన భవానిశంకర్‌ను వెంటనే నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిసి ఫుటేజీల ఆధారంగా నిందితుని గుర్తించారు. గాలింపు చేపట్టి నిందితుడు పీత అజరును అదుపులోకి తీసుకున్నారు. హత్యకు పాత కక్షలే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భవానిశంకర్ మృతితో వార్డులో విషాదం నెలకొంది.
బాధిత కుంటుంబానికి ఎంపీ భరత్ పరామర్శ
బూరాడ భవానిశంకర్ హత్య వార్త తెలియగానే ఢిల్లీలో ఉన్న ఎంపీ భరత్ కష్ణకుమారిని ఫోన్లో పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఎస్‌పితో మాట్లాడానని, ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలేది లేదని తెలిపారు. భవానిశంకర్ తనకు అత్యంత ఆప్తుడని తెలిపారు. మృతుని కుటుంబానికి పార్టీ అంతా అండగా ఉంటుందన్నారు. విషయం తెలియగానే వైసిపి నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, సంకిస భవానీప్రియ, నక్కా నగేష్, పోలు విజయలక్ష్మి, ఎన్‌వి.శ్రీనివాస్, శీతనబోయిన సాయిరామ్, కాంతారాం పాటిల్, గణేష్, కృష్ణవేణి తదితరులు బోరాడ భవానీ శంకర్ ఇంటికి చేరకున్నారు.










