ప్రజాశక్తి - గోపాలపురం
మెట్ట ప్రాంతాల్లో నీటి వసతులేని సన్న, చిన్నకారు రైతులు వైఎస్‌ఆర్ జలకళ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ సూచించారు. ఆదివారం మండలంలోని గంగోలు గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపాలెంలో కలిగొట్ల వెంకటేశ్వరరావు పొలంలో వైఎస్‌ఆర్ జలకళ ద్వారా ఏర్పాటు చేసే బోరు పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల్లో నీటి వసతి లేని రైతుల పంట పొలాలు సస్యశ్యామలం చేసేందుకు వైఎస్‌ఆర్ జలకళ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 2.5 ఎకరాల భూమి కలిగిన రైతులందరూ దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణం లేని రైతులు పక్కా రైతుతో కలిపి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 150 బోర్లు వెయనున్నట్లు తెలిపారు. సన్న చిన్న కారు రైతులు బోర్లు వేసుకుని బీడు బారిన పొలాలను సస్యశ్యామలం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల మాజీ అధ్యక్షులు ఎస్‌కె.ఖాదర్‌వలీ, నాయకులు పీతల ప్రసాద్‌బాబు, కాకులపాటి శ్రీను, ఇళ్ల శ్రీరామమూర్తి, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి పాలకవర్గ బోర్డు మెంబర్ తానింకి గంగరాజు, తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.










