ప్రజాశక్తి - గోపాలపురం
జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన వ్యక్తి కుప్పకూలి చనిపోయిన ఘటన శుక్రవారం గోపాలపురంలో చోటుచేసుకుంది. గోపాలపురం గ్రామానికి చెందిన బాసిన వెంకటేశ్వరరావు, ్త వద్ధురాలు అయిన తల్లితో కలిసి పంచాయతీ వెనుక వీధిలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వెంకటేశ్వరరావు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం గోపాలపురంలో జరిగిన ఆరోగ్య సురక్ష వైద్యశిబిరానికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. బిపి ఎక్కువగా ఉండటంతో వైద్యులు పలురకాల మందులను అందించారు. నాలుగు గంటల ప్రాంతానికి ఇంటికి వచ్చాడు. తల్లికి టీ పెట్టి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి టీ తాగిన అనంతరం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తల్లి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి సపర్యలు చేశారు. 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే వెంకటేశ్వరరావు(68) మృతి చెందాడు. కుమారుని మృతితో తల్లి కన్నీరుమున్నీరైంది. కుమారునిపై పడి ఏడస్తున్న తీరు కంట తడిపెట్టించింది.










