Feb 07,2023 22:55

వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ
వైద్య పరీక్షలతో ముందస్తుగానే కేన్సర్‌ను గుర్తించొచ్చని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం నగరంలోని జిల్లా ఆసుపత్రిలో ఐఎంఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేన్సర్‌పై సరైన అవగాహన లేకపోవడంతో తొలి దశలో గుర్తించ లేక పోతున్నారన్నారు. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించే అవకాశం నేడు అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, వివిధ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచితంగా స్క్రీనింగ్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందుగా గుర్తిస్తే సరైన సమయంలో చికిత్స పొందే వీలుంటుందన్నారు. పురుషుల్లో ఎక్కువ మంది ప్రోస్టేట్‌ కేన్సర్‌, మహిళల్లో ఛాతీ, గర్భాశయ కేన్సర్లకు గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కేన్సర్‌ నిర్ధారణ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు టీచింగ్‌ ఆసుపత్రుల్లోనూ కేన్సర్‌కు చికిత్స అందిస్తారని తెలిపారు. జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన జీవన విధానం ద్వారా కేన్సర్‌ను ఎదుర్కొనడం సాధ్యమన్నారు. ఎటువంటి సంకోచం లేకుండా తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌.గురుప్రసాద్‌, డాక్టర్‌ పద్మలత, జిఎస్‌ఎల్‌ ఆసుపత్రి కేన్సర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌, డెల్టా ఆసుపత్రి అంకాలజిస్ట్‌ డాక్టర్‌ స్ఫూర్తి, జిల్లా ఆసుపత్రి డిఎంఒ డాక్టర్‌ ఆనంద్‌, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.