ప్రజాశక్తి-గోకవరం ముందస్తు వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని జిజిహెచ్ హెచ్‌ఒడి డాక్టర్ సూర్యప్రభ అన్నారు. గురువారం మండల కేంద్రమైన గోకవరం ప్రభుత్వాసుపత్రి వద్ద రాజమహేంద్రవరం జిజిహెచ్‌కు చెందిన డాక్టర్ల అనుసంధానంతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద నూతనంగా ప్రారంభించిన మెడికల్ కాలేజీ అనుసంధానంగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్టు డాక్టర్ సూర్య ప్రభ తెలిపారు. సామాన్య ప్రజలకు సైతం వైద్యం అందించేందుకు ఈ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించామని క్యాన్సర్ వ్యాధే కాక ఇతర క్లిష్టతరమైన వ్యాధులను సైతం నిర్ధారించి వైద్యం అందించేందుకుగాను ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 416 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 49 మందిని క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించారు. గైనిక్ విభాగంలో 39 మందిని క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించారు. వీరిలో 10 మందిని సర్జరీకి రిఫర్ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సునీత, సర్జరీ డాక్టర్ అఖిలేష్, డాక్టర్ సూర్యారావు, డాక్టర్ సుందరరావు, డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ వనజ, ఎంపిహెచ్‌ఇఒ వైఎస్.రాయుడు, పవన్, రమణ ఎఎన్‌ఎం ఆశాలు పాల్గొన్నారు.










