కచ్ఛా డ్రెయిన్ల తవ్వకాలతో ప్రజల ఇబ్బందులు
అధికారి నిర్వాకంతో నిరుపయోగంగా పార్కింగ్ షెడ్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్
వాస్తు పేరుతో ఇరిగేషన్ శాఖలో ఒక ఉన్నత స్థాయి అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అడ్డుగోలుగా తవ్వకాలను నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ సమీపంలో ఇరిగేషన్ కార్యాలయాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న జలవనరుల శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి అధికారి వాస్తు పేరుతో ఐదు దశాబ్ధాలుగా ఉన్న కార్యాలయ రూపురేఖల్ని మార్చేశారు. ఈ కార్యాలయంలోకి వెళ్లే ప్రధాన ద్వారాన్ని మూసేసి గోడ నిర్మించారు. ఐదు దశాబ్ధాలకు పైగా ఈ కార్యాలయంలోకి వెళ్లాలంటే ఇదే ప్రధాన ద్వారంగా ఉంది. ఎంతో మంది ఎస్‌ఇలు ఇతర అధికారులు ఇందులో విధులు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించారు. కాని ఇటీవల వచ్చిన ఒక అధికారి మాత్రం ఇష్టాను సారంగా కార్యాలయం రూపురేఖల్ని మార్చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారి వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసేసిన అధికారి కార్యాలయం వెనుక భాగం నుంచి ద్వారాన్ని తెరిచారు. ఇంత వరకూ బాగానే ఉంది. వెనుకవైపున పల్లంగా ఉండటంతో వర్షపునీరు వెళ్లేందుకు ఇష్టాను సారంగా కచ్చా డ్రెయిన్లను తవ్వించారు. గతంలో బ్యారేజీ కాలనీలో చిన్నారులు ఆడుకునేందుకు ఇక్కడ ఉన్న చిన్నపాటి ఆటస్థలం ఉంది. ఇందులో క్రికెట్, ఇతర ఆటలు వారు ఆడుకునేవారు.గతంలో ఇరిగేషన్ అధికారులు సైతం సాయంత్రం వేళ వాలీబాల్, టెన్నికాయిట్ వంటి ఆటలు ఇదే స్థలంలో ఆడుకునేవారు. ఇటీవల సదరు అధికారి ఆటస్థలం మధ్యగా మీటరున్నర వెడల్పున కచ్ఛా డ్రయిన్‌ను తవ్వించాడు. దీంతో వారంతా ఆటలకు దూరమయ్యారు. అంతేకాకుండా ఇదే ఆటస్థలాన్ని ఆనుకుని ఒక స్టేజీ, గ్రంథాలయం భవనం, ఇరిగేషన్‌కు సంబంధించిన ఆడిటోరియం ఉన్నాయి. ఇక్కడ గ్రంథాలయానికి నిత్యం పాఠకులు వస్తూంటారు. అంతేకాకుండా ఆడిటోరియంలో వివిధ శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరగుతుంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆడిటోరియంలో ఉన్న షటిల్ కోర్టులో గ్రామానికి చెందిన యువకులు, ఇరిగేషన్ ఉద్యోగులు సైతం ఆడుకునేందుకు వస్తుంటారు. ఆడిటోరియానికి వెళ్లే దారిలో సదరు అధికారి కచ్ఛా డ్రెయిన్‌ను తవ్వించారు. ఫలితంగా గ్రంథాలయానికి వెళ్లే పాఠకులు, ఆడిటోరియానికి వెళ్లే ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల వేళ పరిస్థితి మరీ దయణీయంగా ఉంటుందని, డ్రెయిన్‌ను దాటే సందర్భంలో పడిపోతున్నామని గ్రంథాలయాలకు వస్తున్న సీనియర్ సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆడిటోరియం వద్ద ఏవైనా శుభకార్యాలు నిర్వహించుకునే సందర్భంగా కచ్చా డ్రెయిన్ అడ్డంకిగా మారిందని పలువురు చెబుతున్నారు. మరోవైపు తూర్పు వైపున ద్వారం తెరిచిన సమయంలో నాలుగు మీటర్ల వెడల్పున మట్టిని తవ్వేశారు. దీంతో పెద్ద గుంతలా ఏర్పడింది. గుంతకు ఆవల ఇరిగేషన్ ఉద్యోగుల వాహనాల పార్కింగ్ నిమిత్తం షెడ్డును నిర్మించారు. ఈ ద్వారం తెరవక ముందు ఇరిగేషన్ అధికారులు తమ వాహనాలను షెడ్డులో పార్క్ చేసుకునేవారు. ప్రస్తుతం ఇక్కడ మట్టిని తవ్వేయడంతో షెడ్డులో వాహనాలను పార్కింగ్ చేసుకునే అవకాశం లేక ఉద్యోగులు సర్కిల్ కార్యాలయం వెలుపలనే పార్క్ చేసుకోవల్సి వస్తుంది. అధికారి నిర్వాకం కారణంగా లక్షలతో నిర్మించిన వాహనాల షెడ్డు నిరుపయోగంగా మారింది. ఉన్నత స్థాయి అధికారి కావడంతో ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేసే పరిస్థితి లేక నిమ్మకుంటున్నారనే వార్తలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి అడ్డుగోలు తవ్వకాలను మూసేయాలని, కార్యాలయం ద్వారం యథావిధిగా రహదారి వైపు తెరిపించాలని పలువురు కోరుతున్నారు.










