May 22,2023 23:21

వాలంటీర్లను సత్కరిస్తున్న ఎంఎల్‌ఎ తలారి తదితరులు

ప్రజాశక్తి - గోపాలపురం
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంక్షేమ సారథులు వాలంటీర్లేనని, వారి సేవలు అభినందనీయమని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. సోమవారం గోపాలపురం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 3వ విడత వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు వాలంటీర్లని కొనియాడారు. నియోజకవర్గంలో 1,248 మంది, గోపాలపురం మండలంలో 274 వాలంటీర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. అందులో 243 మంది వాలంటీర్లకు సుమారు రూ.25 లక్షలు మేర పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్లకు త్వరలో జీతాల పెంచే విధంగా, పర్మినెంట్‌ చేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.2 వేల కోట్ల మేర సంక్షేమ పథకాలు అందించామని, సుమారు రూ.500 కోట్లు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అనంతరం వాలంటీర్లను సత్కరించారు. అలాగే ఎంఎల్‌ఎ తలారిని, సొసైటీ అధ్యక్షులు కూసం రామ్మోహన్‌ రెడ్డిని వాలంటీర్లు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, జడ్‌పిటిసి సభ్యులు కె.లలిత, ఎంపిడిఒ ఆర్‌.శ్రీదేవి, సర్పంచ్‌ పైడి శిరీష, పంచాయతీ కార్యదర్శి ఎస్‌.చిన్న వెంకయ్యమ్మ, చిట్యాల సొసైటీ అధ్యక్షులు దుగ్గిరాల రమేష్‌, మాజీ మండల అధ్యక్షులు ఖాదర్‌ వలీ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.