ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గ్రామ ప్రథమ పౌరులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బకాయిలపై ప్రశ్నిస్తే ఎక్కడ ఇబ్బందులు పెడతారనే భయంతో ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా, నష్ట మొచ్చినా సర్పంచ్ తలుపే తడతారు.. ఊళ్లో ఏ పనీ జరగాలన్నా సర్పంచ్‌ల ద్వారానే నడుస్తాయి. మొత్తానికి ఆ ఊరికి సర్పంచే సర్వస్వం. కానీ మారిన పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఇప్పుడా పదవి ముళ్ల కుర్చీలా మారుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, గ్రామాల్లోనూ ఎంఎల్‌ఎల ఆదిపత్యంతో సర్పంచ్ కుర్చీకి విలువ తగ్గుతోంది. రూ.లక్షలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలుపొందితే ఆశించిన మేర పనులు సాగక వారు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
ఆర్థిక సంఘం నిధులూ పక్కదారి
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులూ పక్కదారి పడుతున్నాయి. ఈ నిధులు ఏ పనులకు ఎంత శాతం వెచ్చించాలనే ఖచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘిస్తోంది. రెండేళ్లుగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తోంది. జిల్లాలో 300 పంచాయతీలున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సర్పంచ్‌లు అనే తేడాలేకుండా అందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో బిల్లులు పెట్టగానే ఆరు నెలల లోపే మంజూరు కాగా.. ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నా రావడం లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. చాగల్లులో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక సర్పంచ్‌కు రూ.రెండు లక్షల బకాయిలు నిలిచిపోయాయి. సీతానగరం మండలంలో మరొక పంచాయతీకి రూ.లక్షల్లో బిల్లులు రావాల్సి ఉంది. సర్పంచ్ బ్యాంకులకు తిరిగి చెల్లించలేకపోవటంతో సదరు బ్యాంకు యాజమాన్యం ఆస్తులను సైతం జప్తు చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రతి మండలంలోనూ నెలకొంది. అత్యధిక మంది సర్పంచ్‌లు బిల్లులు రాకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామాల్లోనూ ఎంఎల్‌ఏలదే పై చేయి
గ్రామాల్లోనూ ఎంఎల్‌ఎలే ఆదిపత్యం చెలాయిస్తున్నారు. సర్పంచ్‌లు సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేస్తే ఎంఎల్‌ఎలు ప్రారంభోత్సం పేరుతో హడావుడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సర్పంచ్‌లుగా అధికారం చేపట్టి గత నెలతో రెండు సంవత్సరాలు పూర్తయింది. అధికార పార్టీ ఒత్తిడితో కొందరు రూ.లక్షలు వెచ్చిస్తే, మరి కొందరు రూ.కోట్లు వెచ్చించారనేది బహిరంగ రహస్యం. ఆ ఖర్చులకు తోడా తాజాగా ఆర్థిక ఇబ్బందులు గోరుచుట్టుపై రోకలిపోటులా మారాయి. ప్రభుత్వ తీరుపై వ్యతిరేక స్వరం వ్యక్తమవుతోంది. పారిశుధ్య కార్మికులకు సైతం వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారు సొంతంగా ఖర్చు చేసి కొన్ని పనులు చేయించారు. గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గతంలో వేసిన లైట్లు సైతం కొన్ని చోట్ల వెలగడం లేదు. ప్రజలు సర్పంచ్‌లను నిలదీస్తుండడంతో వారు సొంత ఖర్చులతో రిపేర్లు చేయిస్తున్నారు. తాగునీటి పైపులైన్ల మరమ్మతుల ఖర్చులను సైతం తామే భరిస్తున్నామని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రూ.లక్షల్లో ఖర్చు చేశామని, ఇప్పుడు అప్పులు తెచ్చి పనులు చేయించడం తలకు మించిన భారంగా మారుతోందని సర్పంచ్‌లు వాపోతున్నారు.










