Oct 05,2023 23:29

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఈ నెల 8న రాజమహేంద్ర వరం నగరంలో నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జయప్రదం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ పిలుపు నిచ్చారు. గురువారం నందం గనిరాజు జంక్షన్‌ నుంచి విద్యార్థులతో నిర్వహించిన స్పేస్‌ వాక్‌కు కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం విగ్రహానికి శ్రీహరికోట ఎస్‌డిఎస్‌సి గ్రూప్‌ డైరెక్టర్‌ పి గోపీకృష్ణ, షార్‌ ఎల్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ జిఎం ఎన్‌. విజయకుమార్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ కె దినేష్‌ కుమార్‌, రాజమహేంద్రి మహిళా కళాశాల ఛైైర్మన్‌ టికె.విశ్వేశ్వర రెడ్డి పూలమాలలు వేసి నివాళల ర్పించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇస్రో ఆధ్వర్యాన వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం దగ్గర రాకెట్స్‌, ఇతర పరికరాలతో కూడిన ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనను రోజుకి పదివేల మంది విద్యార్థులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నిర్వహించడం సహజమని, అయితే ప్రజల మధ్యన ఇస్రో అంతరిక్ష వారోత్సవాలు ఏర్పాటు చేసిందన్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనల్లో వస్తున్న మార్పులపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. షార్‌ ఎల్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌. విజయకుమార్‌ మాట్లాడుతూ అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులకు నిర్వహించిన క్విజ్‌, డ్రాయింగ్‌ పోటీలకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజల నడుమ నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు రికార్డు సష్టించబోతున్నాయన్నారు. మానవాళికి అవసరమైన సౌకర్యాల కల్పనకు ఇస్రో పరిశోధనలు నిరంతరం కొనసాగిస్తూ ఇప్పటికే ఎన్నో విజయాలను సొంతం చేసుకుందని శ్రీహరికోట ఎస్‌డిఎస్‌సి గ్రూప్‌ డైరెక్టర్‌ పి గోపీకృష్ణ అన్నారు. అన్వేషణ నిరంతరం కొనసాగుతుందన్నారు. శ్రీహరికోట ఎస్‌డిఎస్‌సి హెడ్‌ బడ్జెట్‌ లీలా నాగ శ్రీనివాస్‌, పలువురు ఇస్రో సైంటిస్టులు, సిబ్బంది, పాల్గొన్నారు.