ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహానాడు కార్యక్రమంగా శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో రెండ్రోజుల పాటు ఈ మహానాడు జరుగనుంది. వేలాది మంది ప్రతినిధుల రాకతో వేమగిరి ఉక్కిరి బిక్కిరైంది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు ప్రతినిధుల సభను నిర్వహించారు. ఆదివారం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రతినిధుల సభ కార్యక్రమంలో భాగంగా ఉదయం 8.30 గంటలకు సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చిత్తూరు విభాగంలోనూ, యువనేత నారాలోకేష్ గుంటూరు విభాగంలోనూ పేర్లు నమోదు చేయించుకున్నారు. అనంతరం 11 గంటలకు చంద్రబాబు పతాకావిష్కరణ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. కార్యదర్శి నివేదికను ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రవేశ పెట్టారు. ఇటీవల కాలంలో మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం ఒకొక్కరుగా తీర్మానాలను ప్రవేశ పెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
హైవేపై ట్రాఫిక్ రద్దీ
మహానాడు సభకు ఆ పార్టీ శ్రేణులు అంచనా వేసినట్లుగానే సుమారు 15 వేల మంది హాజరయ్యారు. ఈ నేపధ్యంలో రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రతినిధులు వివిధ వాహనాల్లో జిల్లాకు చేరుకున్నారు. వాహనాలతో ఉదయం 11 గంటలకే పార్కింగ్ ప్రాంతాలు నిండిపోయాయి. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో 2 కిలో మీటర్ల దూరంలో వాహనాలు నిలిపి, దూరంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు పంపించారు. ఫలితంగా ప్రతినిధులు ఎండలోనే సుమారు 2 కిలో మీటర్లు నడిచి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఉదయం11 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కావటంతో అత్యధిక మంది హైవేపై రోడ్డుకు పక్కనే వాహనాలను బారులుగా నిలిపివేశారు. దీంతో కడియం వేమగిరి నుంచి రాజమహేంద్రవరం బొమ్మూరు వరకూ జాతీయ రహదారికిరువైపులా కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు బారులు తీరాయి.
ఎన్‌టిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవలు
మహానాడు వేదికగా ఎన్‌టిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవలందించారు. ప్రతినిధుల సభ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మరో వైపు కార్యకర్తలకు వైద్య శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి కుమారుడు డాక్టర్ రవిరామ్ గోరంట్ల పలువురు వైద్య సిబ్బంది కార్యకర్తలకు వైద్య సేవలందించారు. రెండ్రోజుల పాటు 6 టీములుగా 20 మంది డాక్టర్లు, 20 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది సంయుక్తంగా ఈ సేవలందించనున్నాను. డయాబెటిస్, బిపి తదితర దీర్ఘకాలిక వ్యాధులతో పాటు వడదెబ్బ, ఇతరాత్ర సమస్యలతో బాధపడే వారికోసం సిలైన్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లను సైతం సిద్ధం చేశారు. తొలి రోజు సుమారు 500 మందికి సేవలందించారు. అలాగే ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పలువురిని ఆకట్టు కుంది. పలువురు ప్రతినిధులు ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు.
నేడు బారీ బహిరంగ సభ
నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని నలు మూలల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ సభకు తరలిరానున్నారు. సుమారు 15 లక్షల మంది రానున్నట్లు ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. వచ్చిన వారందరికీ రాజమహేంద్రవరం ముఖ ద్వారాలలోనే భోజనం ఏర్పాట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే వాహనాలు నిలుపుదలకు పార్కింగ్ స్థలాలను గుర్తించింది. ఆయా పార్కింగ్ స్థలాలు సభా ప్రాంగణానికి సుమారు 2 నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.










