Mar 09,2023 23:04

ప్రజాశక్తి-కడియం అందరూ సమిష్టి కృషితో బేదాభిప్రాయాలు లేకుండా పాఠశాలలో పని చేసినపుడే మంచి ఫలితాలు సాధించగలమని జిల్లా ఉప విద్యాశాఖాధికారి ఎం.తిరుమలదాస్‌ కడియం మండలం దుళ్ల హైస్కూల్‌ ఉపాధ్యాయులకు క్లాస్‌ తీసుకున్నారు. హైస్కూల్లో తరచూ వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్‌ కమిటీతో సమావేశమయ్యారు. వివాదాలకు కారణాలను ఆరా తీశారు. పలు తరగతుల విద్యార్థులు తరచూ ఘర్షణ పడడం, దాడులు చేసుకోవడం, చదువులో దారుణంగా వెనుకబడడం వంటి విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. దీనిపై ప్రధాన ఉపాధ్యాయిని సుధ వివరణ ఇస్తూ పాఠశాల జరుగుచున్న సమయంలో మాత్రం ఏ వివాదాలు లేవని, అనంతరం బయట వ్యక్తులతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఎంఇఒ లజపతిరారు, మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ నూలు సోమేశ్వరరావు, ఉప సర్పంచ్‌ తోకల శ్రీనివాస్‌, గుంటూరి లక్ష్మి, కంటిపూడి సాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.