May 09,2023 00:17

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సెలవులకు మంగళం పలికిందా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. సిపిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొన్నేళ్లుగా ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్న విషయం విదితమే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వురు లవ్‌ రీడింగ్‌ పేరుతో వేసవిలోనూ షెడ్యూలు జారీ చేయడం వేధింపుల్లో భాగమేననే అభిప్రాయం ఉపాధ్యాయులు, ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం 'వురు లవ్‌ రీడింగ్‌ అమలు చేస్తోంది. ఉపాధ్యాయులకు ఇచ్చిన బాధ్యత కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ వెకేషన్‌ ఉద్యోగులుగా ఉన్న టీచర్లు నాన్‌-వెకేషన్‌ ఉద్యోగులుగా మారిపోయారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తమకు తక్షణమే తమకు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏడాదికి 30 ఇఎల్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
వురు లవ్‌ రీడింగ్‌ అమలు ఇలా....
జిల్లాలో ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్‌, జిల్లా ఫరిషత్‌ పాఠశాలలు మొత్తం 990 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 1.21 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,279 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేసవి సెలవుల్లో వారందరన్నీ టీచర్లు పర్యవేక్షించాల్సి ఉంది. ఆయా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను బట్టి సుమారు 20 మంది విద్యార్థులతో వాట్సాప్‌లో ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడాలి. వారితో ఒక నోట్‌ బుక్‌ను నిర్వహించాలి. తరగతుల వారీగా మానవతా విలువలు, భాషా, సజనాత్మక, మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు పెంచేలా కార్యక్రమాలు అమలు చేయాలి. కొన్ని గణిత సమస్యలను పరిష్కరించేలా చూడాలి. రోజూ ఉపాధ్యాయులు వారికి టచ్‌లో ఉండాలి. అంతేకాదు సెలవుల్లో నోట్‌బుక్‌లో పొందుపరిచిన అంశాలను పాఠశాలలు పున్ణప్రారంభమైన తర్వాత పూర్తిస్థాయిలో పరిశీలించాలి. సెలవుల్లో విద్యార్థులు చేసే పనులను సంబంధించి ఫొటోలు, వీడియోలు తీసి నివేదిక రూపంలో సేకరించాలి. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఇందులో భాగస్వామ్యం చేయాలి. పుస్తకాలు చదివేలా విద్యార్థులను ప్రోత్సహిస్తూనే.. వారికి కొన్ని పుస్తకాలను సూచించాలి. గ్రంథాయాలకు వెళ్లి పుస్తకాలను తెచ్చుకొని చదవేలా అవగాహన కల్పించాలి. అవసరమైతే కొన్నింటిపై ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి. క్రీడలు, డ్యాన్స్‌లు, యోగా కార్యక్రమంలో పిల్లలు పాల్గొనే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో చేపట్టాల్సి ఉంది. అంతేకాదు పాఠశాలల పున్ణప్రారంభం రోజున వాటిని బడిలో ప్రదర్శించాలనే షరతు పెట్టారు. అయితే గతంలో ఈ పరిస్థితి లేదన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రభుత్వం అప్పగించే పనులు నిర్వహించేవారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సెలవులు తీసుకున్నందుకు బదులుగా ఈఎల్స్‌ తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులపైనా తీవ్ర ప్రభావం
వేసవి వచ్చిందంటే పాఠశాలలకు సెలవుల కోసం విద్యార్థులే కాదు తల్లిదండ్రులు సైతం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి ఆటపాటలతో సందడి చేయాలని భావిస్తారు. అంతేకాక తల్లిండ్రులతో కలిసి తాత, అమ్మమ్మ, బంధువుల ఇళ్లతో పాటు పుణ్య క్షేత్రాలు, విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు. ఈ క్రమంలో స్థానికంగా పిల్లలు ఉండే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన కార్యక్రమం ఎలా అమలవుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరో వైపు స్మార్ట్‌ ఫోన్లు లేని విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది సందేహంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారే. వారి తల్లిదండ్రుల వద్ద ఒక స్మార్ట్‌ఫోన్‌ లేదా లేదా ఒక కీప్యాడ్‌ ఫోన్‌ ఉండే అవకాశం ఉంది. అందరి వద్ద రెండేసి స్మార్ట్‌ ఫోన్లు ఉండవు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోతే విద్యార్థుల వద్ద ఫోన్‌ ఉండదు. ఈ సమయంలో ఉపాధ్యాయులు కూడా ఎలా పర్యవేక్షణ చేస్తారో అధికారులే చెప్పాల్సి ఉంది. స్మార్ట్‌ ఫోన్లు లేని పిల్లలను పర్యవేక్షణ చేపట్టడం ఎలా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.