Apr 27,2023 23:35

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులపై విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తీరును నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో పదో తరగతి పరీక్షల పేపర్ల వాల్యూయేషన్‌ కేంద్రం వద్ద భోజన విరామ సమయంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఫ్యాప్టో చైర్మన్‌ పి.జయకర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విలువ ఉన్నప్పుడే మంచి విలువలున్న భావి సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందజేయకుండా, నాణ్యత లేని బ్యాగులు, బూట్లు అందజేసి వాటికి బాధ్యత వహించాల్సిన ఉన్నతాధికారులు క్రింది స్థాయిలో ఉన్న విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను బాధ్యులుగా చేసి సస్పెన్షన్‌ చేయడం దారుణం అన్నారు. ఈ అక్రమ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల పట్ల ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్యాప్టో కార్యవర్గం డి.దుర్గారావు, ఉదయ బ్రహ్మం, డేనియల్‌ షరీఫ్‌ తదితరులు ప్రసంగించారు. ఇకనైనా ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులపై ప్రవీణ్‌ ప్రకాష్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలని పేర్కొన్నారు. లేకుంటే భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. సిపిఎస్‌ రద్దు చేయాలని, ఒపిఎస్‌ పునరుద్ధరించాలని విద్యా శాఖలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు.