Mar 05,2023 23:45

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనల కారణంగా మేట్లపై అదనపు భారం పడుతోంది. నూతన సాఫ్ట్వేర్‌ విధానంపై పూర్తిస్థాయి అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూలీలకు అరకొర ఉపాధి పనులే దక్కుతున్నాయి. జిల్లాలో 300 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. 2.96 లక్షల జాబ్‌ కార్డులును మంజూరు చేశారు. ఇందులో 5.26 లక్షల మంది కూలీలుగా నమోదయ్యారు. 1.31 లక్షల జాబ్‌కార్డులకు సంబంధించి 1.95 లక్షల మంది పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసి) సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే వేసవిలో అమలు చేసే సమ్మర్‌ అలవెన్సులకు కోత విధించిన విషయం విదితమే. తాజాగా మేట్లకు అందించే అలవెన్సులకు సైతం కోత విధించినట్లు తెలుస్తోంది. ఫలితం స్వంత ఖర్చులు వెచ్చించాల్సి వస్తుందని మేట్లు వాపోతున్నారు.
కొత్త సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చని అలవెన్సులు
గతంలో ఒక మేట్‌ పరిధిలో పది నుంచి 20 మంది సభ్యులుగా గ్రూపు పనిచేసే వారు. ప్రస్తుతం కొత్త గ్రూపులను ఏర్పాటు చేసి మహిళలను మాత్రమే మేట్లుగా నియమించారు. ఒక్కొక్కరికీ 50 కుటుంబాల బాధ్యతను అప్పగించారు. గ్రూపు సభ్యుల హాజరు, తదితర అంశాలను పర్యవేక్షిస్తూ మొబైల్‌ ద్వారా మస్తర్లు వేయాలి. సెల్‌ఫోన్లు ఇవ్వకపోవడంతో సొంత ఫోన్లనే వినియోగిస్తున్నారు. గతంలో 20 మందికి పని చెబితే సరిపోయేది. ఒక్కో కూలీకి రూ.3 చొప్పున మేట్లకు కమీషన్‌ ఇచ్చేవారు. టెంట్‌కు రూ.10, ప్రథమ చికిత్స కిట్‌ ఏర్పాటు చేస్తే రూ.3 ఇచ్చేవారు ఇప్పుడు అదేమీలేదు. 50 కుటుంబాలుంటే 120 మందికి పైబడి కూలీలకు పని చూపించి, చేయించి ప్రభుత్వానికి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పంపించేందుకు మేట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌లో మేట్‌ సిస్టమ్‌ లేదు. క్షేత్ర సహాయకులకు ఒకరు సహాయకునిగా పనిచేస్తారు. వారు సెల్‌ ద్వారా మస్తరు పంపిస్తారు. మళ్లీ ఫీల్డు అసిస్టెంట్‌ మస్తరు వేయాల్సిందే. ఉపాధి హామీ కూలీలకు మూడేళ్లుగా పరికరాలు ఇవ్వడం లేదు. దీంతో వారే సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. వీటి కోసం ఒక్కొక్కరు రూ.350 నుంచి రూ.500 వరకూ చెల్లిస్తున్నారు.
సమ్మర్‌ అలవెన్సులకు మంగళం
గతంలో ఫిబ్రవరి మొదలుకొని జూన్‌ వరకూ 5 నెలల పాటు దశల వారీగా 10 నుంచి 50 శాతం వరకూ సమ్మర్‌ అలవెన్సులను మంజూరు చేసేవారు. గతేడాది నుంచి సమ్మర్‌ అలవెన్సులకు మంగళం పలికారు. దీంతో చేసిన పనికి మాత్రమే కూలి విడుదల అవుతోంది. తాజాగా మేట్లకూ అలవెన్సుల కోత విధించటంతో అదనపు భారం పడుతోంది. నిబంధనల ప్రకారం కూలీల వేతనాలకు 60 శాతం, సామగ్రికి 40 శాతం నిధులు వెచ్చించాలి. పరిపాలనా ఖర్చుల కింద ఆరు శాతం మించకుండా చూసుకోవాలి. గతంలో సామగ్రి నిధులతో కూలీలకు పార, పలుగు, తట్టలు, నీడ కోసం టెంట్లు, ప్రాథమిక చికిత్సకు కిట్లు కొనుగోలు చేసి అందించారు. మూడేళ్లకుపైగా పరికరాలను కొనుగోలుకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కూలీలే సొంత డబ్బులతో వాటిని కొనుగోలు చేసుకుంటున్నారు.