May 21,2023 00:01

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిది ఉపాధి హామీ కార్మికులకు వేసవిలో అందించే సమ్మర్‌ అలవెన్సులకు కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి మంగళం పలికింది. ఏటా వేసవి నేపథ్యంలో నాలుగు నెలల పాటు ఉపాధి హామీ కూలీలకు సమ్మర్‌ అడ్వాన్సులు అందించడం పరిపాటి. వేసవి కాలంలో ఉపాధిహామీ కూలీలు వేడిని తట్టుకొని పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా పని కూడా తగ్గుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పనిగంటలు తగ్గించి వేసవి అలవెన్స్‌ను ప్రభుత్వం అందిస్తుంది. ఆ విధంగా ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్‌, మే 30 శాతం, జూన్‌లో 20 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ అందించేవారు. అయా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ద్వారా అలవెన్స్‌ వివరాలు పొందుపర్చేవారు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రూపొందించిన ఎన్‌ఐసి సాప్ట్‌వేర్‌ ద్వారా పనులు చేపడుతున్న క్రమంలో సమ్మర్‌ అలవెన్స్‌ ఆప్షన్‌ లేదు. కార్మిక సంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తే ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించి 11 గంటలకు ముగిస్తామని సమాధానం చెప్పుకొచ్చారు. ఆచరణలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఫొటో అప్‌లోడ్‌ సమస్యల కారణంగా ఉపాధి కూలీలు పని ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే నాటికి మధ్యాహ్నం 2 గంటలవుతుంది. వేసవిలో పనులు చేస్తున్నప్పటికీ సమ్మర్‌ అలవెన్స్‌లు అందించడంలేదని కార్మికులు వాపోతున్నారు. ఉపాధి పనుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ఫలితమేనని స్పష్టమవుతుంది.
జిల్లాలో ఆరు లక్షల పైగా జాబ్‌ కార్డులు
జిల్లాలో 1.89 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. గ్రామాల్లో వ్యవసాయ కార్మికులతో పాటు పట్టభద్రులైన నిరుద్యోగులైన యువత కూడా ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఉపాధి పనులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ 2022 నుంచి కేంద్ర కనుసన్నల్లోకి వెళ్లిన విషయం విదితమే. ఉపాధి పనులు గుర్తించడం నుంచి మార్పులు, చేర్పుల వరకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తోంది. అప్పటి వరకూ వినియోగించిన టిజిఎ సాఫ్ట్‌వేర్‌ స్థానంలో నేషనల్‌ ఇన్‌ఫర్‌మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసి) సర్వర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారానే ఉపాధిహామీ పనులు వివరాలు పొందుపరుస్తూ పనులు నిర్వహిస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లాక్‌డౌన్‌ జన జీవనాన్ని పూర్తిగా స్తంభింప చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గడిచిన రెండేళ్లలో గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఈ పనులే కీలక భూమికను పోషించాయి.
ఉపాధి చట్టానికి తూట్లు
గ్రామీణ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలని వామపక్ష పార్టీలు పోరాడి సాధించిన ఉపాధి చట్టానికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వ, ప్రస్తుత బీజేపీ అమలులో తూట్లు పొడుస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో నిధుల కోత ప్రతియేటా పరిపాటిగా మారింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరో కారణంగా తెలుస్తుంది. అవినీతి అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకంలో ఎవరైనా కూలి పని అడిగిన 14 రోజుల్లో పని కల్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో నిరుద్యోగ భతి చెల్లించాలి. కానీ గ్రామాల్లో నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదు. నూతన విధానం ద్వారా ప్రతీ పనికీ జియోట్యాగింగ్‌ చేసిన తర్వాతనే పనులను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఉపాధి హామీలో వస్తున్న మార్పులు, అలవెన్సులు ఆప్షన్‌ లేకపోవడంతో ఉపాధి కూలీలు నిరాశ చెందుతున్నారు. దీని ఆధారంగానే నేరుగా బ్యాంకు ఖాతాల్లో పనులకు సంబంధించిన బిల్లులను జమ చేస్తారని కూలీల చెల్లింపులో ఆలస్యం జరగదని అధికారులు చెబుతున్నారు.