ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన పని దినాలను కల్పించి లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఉపాధి హామీ, వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక, రబీ ధాన్యం కొనుగోలు, వ్యవసాయ యంత్ర సేవాపథకం, గ్రామ వార్డ్ సచివాలయాలు, స్పందన అర్జీలు పరిష్కారం, ఎపిక్ కార్డ్, 6బి ఫారం ఆధార్ అనుసంధానం వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ మాధవీలత సమీక్షించారు. ఉపాధి హామీలో జిల్లాలో 59 లక్షల పనిదినాలకుగాను 83.19 శాతం మేర లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. మిగిలిన లక్ష్యాలపై కార్యాచరణ నిర్ధేశించుకుని ప్రగతి సాధించాలని స్పష్టం చేశారు. జిల్లాలో సగటు వేతనం రూ.2,21.01 అందించా మన్నారు. లక్ష్యలు పూర్తి చేయడంలో వెనుకబడిన మండలాలు త్వరితగతిన ప్రగతి సాధించాలన్నారు. రానున్న నెలలో జిల్లాలో వైఎస్‌ఆర్ పెన్షన్ పంపిణీ 1వ తేదీ ఉదయం 6 గంటలకే ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేసే విధంగా ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు చేపట్టాలన్నారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీనీ నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో వైయస్సార్ యంత్ర సేవా పథకం అమల్లో భాగంగా 273 సిహెచ్‌సి గ్రూపులు లక్ష్యానికి గాను 146 గ్రూపులను ఎంపిక చేసిన బ్యాంకు ఖాతాలను ప్రారంభించారని, మిగిలిన గ్రూపులను కూడా ఆయా ఆర్‌బికెఎల్ ద్వారా ఎంపిక చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి లక్ష్య సాధన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో రబీ పంటకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్‌లో అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాల్లోనూ, కొవ్వూరు డివిజన్‌కు సంబంధించి తాళ్లపూడి, చాగల్లు మండలాల్లోనూ ముందస్తుగా కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీబ్యాగ్‌ల అంచనా వంటి అంశాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ జి.నరసింహులు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు, డ్వామా పీడీ జిఎస్.రామ్ గోపాల్, డిఆర్‌డిఎ పీడీ సుభాషిణి, డిఎల్‌ఒ వీణాదేవి పాల్గొన్నారు.










