ప్రజాశక్తి-రాజమహేంద్రవరం నవరత్నాలు పేదలందరికీ సొంతింటిలో భాగంగా రానున్న ఉగాది నాటికి జిల్లాకు నిర్దేశించిన పూర్తి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గృహ నిర్మాణ లక్ష్యాలపై హౌసింగ్, సమన్వయ క్షేత్రస్థాయి అధికారులతో మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఉగాది నాటికి 18,273 నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 14,231 గృహాలు పూర్తయ్యాయని, మరో 4,042 గహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్న వాటిని వేగవంతం చేసి లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జగనన్న లేఅవుట్లలో గహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లే అవుట్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారం వారం లక్ష్యాలను నిర్ణయించుకుని ఆ మేరకు పూర్తి చేయాలని, ప్రతి రోజు సమీక్ష చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ల నుంచి హౌసింగ్ అధికారుల వరకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా హౌసింగ్ అధికారి జి.పరశురామ్, డ్వామా పీడీ జిఎస్.రాజగోపాల్ పాల్గొన్నారు.










