ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
గోదావరి నది వరద ఉధృతి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వర్యం బ్యారేజీ నుంచి 16.32 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయటంతో లంక గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు గత వారం రో జులుగా గోదావరి నది వరద పరివాహక ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం విదితమే. ఆదివారమూ అదే ఒరవడి కొనసాగింది. భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు 50.50అడుగుల నీటిమట్టం నమోదైంది. అక్కడ 24 గంటల క్రితం 55.60అడుగులు నమోదైన విషయం విదితమే. 5 అడుగుల మేరకు నీటిమట్టం తగ్గింది. 53 అడుగులకు తక్కువగా ఉండటంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహచించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉదృతి కొనసాగటంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమలోని పరివాహక ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. భద్రాచలం నుంచి వస్తున్న ప్రవాహాన్ని అంచనా వేసుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు 16 అడుగుల నీటిమట్టం నమోదైంది. 24 గంటల క్రితం ఇక్కడ 15 అడుగుల నీటిమట్టం నమోదైన విషయం విదితమే. మరో అడుగు నీటిమట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరి జారీ చేసే అవకాశాలున్నాయి. కాటన్ బ్యారేజీలోని 175 గేట్ల ద్వారా మిగులు జలాలను సముద్రానికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ మరో 24 గంటల పాటు వరద ఉదృతి కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వలకు 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని పాత బ్రిడ్జి వద్ద 15.54 మీటర్లు నీటి మట్టం ఉంది. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద నీరు పోటెత్తుతుండటంతో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే పలు లంక గ్రామాలకు వెళ్లే కాజ్వే లు నీట మునగడంతో పడవలపైనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో మామిడికుదురు మండలం అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెం, అయినవిల్లిలంక, పల్లపులంక, శానపల్లిలంక, అద్దంకివారిలంక, పి.గన్నవరం మండలం శివాయలంక, గంటిపెదపూడి లంక, అరిగెల వారిలంక, ఊడిమూడిలంక, బూరుగులంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పడవలపైనే గత రెండ్రోజులుగా ప్రయాణాలు సాగిస్తున్నారు.
పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి వనిత
కొవ్వూరు రూరల్ : మద్దూరు జెడ్‌పి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పరిశీలించారు. ఆదివారం పునరావాస కేంద్రంలోని ముంపు గ్రామాల ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పునరావాస కేంద్రం లో ప్రజలను ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అంది స్తున్నా రని, ఏర్పాట్లు బాగున్నాయని అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనం తరం మద్దూరులంకలో గోదావరి ఉధతి, ఏటిగట్లను మంత్రి వనిత పరిశీలించారు.
గోదావరి ఉధృతికి నీటమునిగిని లంకలు
పెరవలి: మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతం 18 కిలోమీటర్ల పొడవు ఉంది కానురు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముత్యాలవారిపాలెం, ముక్కామల, ఖండవల్లి, లంకమాలపల్లి, మల్లేశ్వరం, కడిం పాడు తదితర గ్రామాల పరిధిలో లంక భూముల్లో తోటల నీట మునిగాయి










