Jul 21,2023 23:59

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, యంత్రాంగం ఛత్తీస్‌ఘడ్‌, ఒడిషా, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం 6 గంటలకు 42.70 అడుగుల నీటిమట్టం నమోదయ్యింది. అక్కడ 24 గంటల క్రితం 43 అడుగులకు మించి నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం విదితమే. దిగువకు 10.05 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఎగువ ప్రాజెక్టులైన ఏటూరు నాగారం, దుమ్ముగూడెం, కాలేశ్వరం ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి క్రమ క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు కాస్తంత ఊరట లభించింది. ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో ధవళేశ్వరంలోని సర్‌ ఆర్దర్‌ కాటన్‌ బ్యారేజీ వరద నీరు పోటెత్తుతోంది. మధ్యాహ్నం 11.30 గంటలకు 11.30 అడుగుల నీటిమట్టం నమోదైంది. 1గంటకు 11.40 అడుగులు, 2 గంటలకు 11.50 అడుగులు, సాయంత్రం 4 గంటలకు 11.60 అడుగులు 7గంటలకు 11.70 అడుగల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీలోని 175 గేట్ల ద్వారా 9.73లక్షల క్యూసెక్కుల నీటిని ఎగువ నుంచి వస్తున్నందున వరద నీటిని అంచనా వేసుకుని దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్‌ బ్యారేజీ వద్దకు భారీగా వరద నీరు చేరుతుందని అధికారులు అంచనా వేసి బ్యారేజీ హెడ్‌ వర్క్‌ ఇఇ మొదటి ప్రమాద హెచ్చరిక కొద్దిసేపట్లో జారీ చేయనున్నట్లు సమాచారం. భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. అప్పర్‌ స్పిల్‌ వే వద్ద 28.000 మీటర్లు నమోదు కాగా, దిగువ స్పిల్‌వే వద్ద 24.400 మీటర్లు నీటిమట్టం నమోదైంది. అక్కడి నుంచి 48 గేట్ల ద్వారా దిగువకు 9.30 లక్షల క్యూసెక్కుల నీరు దిగువలకు విడుదలవుతోంది. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ మద్య రాజమహేంద్రవరంలోని పాత బ్రిడ్జి వద్ద 14.23 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఈ నేపథ్యంలో కాటన్‌ బ్యారేజీ నుంచి మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయడంతో పాటు తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాలువలకు 11000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ ఎగువను ఉన్న సీతానగరం మండలంలోని ములకల్లంక గ్రామం వద్ద నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. కొవ్వూరులోని లంక గ్రామాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బ్యారేజీ నుంచి 10 లక్షలకపైగా క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, మామిడికుదురు మండలం అప్పనపల్లి, పి.గన్నవరం మండలం చాకలిపాలెం కాజ్‌వేల వద్ద డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. కాజ్‌వేలపై నీరు చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫలితంగా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. పోలీసు,రెవెన్యూ శాఖ అధికారులు జలవనరుల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయినవిల్లి మండలంలోని అయినవిల్లిలంక గొగరు పాయి వంతెన వద్ద వరద ఉధతిని, లంక గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు, ఆర్‌డిఒ ముక్కంటి, తహశీల్దారు నాగలక్ష్మిమ్మ, ఎంపిడిఒ వెంకటాచార్యులు పరిశీలిమచారు. వరద పరిస్థితులపై సిబ్బందితో సమీక్షించారు.
రామచంద్రపురం ధవలేశ్వరం వద్ద వరద నీరు కిందకి విడుదల చేయడంతో కోటిపల్లి వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. ఇప్పటికే ఇక్కడ స్నాన ఘట్టాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. గురువారం నుండి కోటిపల్లి ముక్తేశ్వరం రేవులో ప్రయాణాలను పూర్తిగా నిలిపివేశారు. శుక్రవారం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్లను ఇంజనీర్లు పరిశీలించారు. గంగవరం మండలం సుందరపల్లి వద్ద ఏటిగట్టు బలహీనంగా ఉన్న ప్రాంతంలో ఇసుక, సర్వే కర్రలు వేశారు. కె.గంగవరం తహశీల్దార్‌ వైద్యనాథ్‌ శర్మ సర్పంచ్‌ బేబీ సత్తిబాబు వరద పరిస్థితిని సమీక్షించారు. మామిడికుదురు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వరద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వరద నీరు మరింత పెరిగితే శనివారం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో ఆయా లంక గ్రామాలకు ప్రైవేటు పాఠశాలలు తిప్పే బస్సులు నిలిచిపోతాయి. లంక గ్రామాలలో వరదనీట నుంచి రహదారికి విముక్తి కలిగే వరకు చదువులు నిలిచిపోతాయి. నది వరద ముంపు నీటిలో పోటెత్తడంతో పాశర్లపూడి నుంచి లంక గ్రామాలైన పెదపట్నంలంక, బి.దొడ్డవరం, అప్పనపల్లి వెళ్లే రహదారితో పాటు రేవులో వరద నీరు చేరింది. తహశీల్దారు రియాజ్‌ హుస్సేన్‌ లంక గ్రామాలను పరిశీలించారు. పి.గన్నవరం మండలంలో కనకాయిలంక నీట మునిగింది. గంటి పెదపూడిలంక, ఉడిమూడిలంక, అరిగెల వారిలంక, బూరుగులంక వాసులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కపిలేశ్వరపురం మండలంలోని లంక గ్రామాలైన కేదార్లంక, వీధివారిలంక, నారాయణలంకలో తహశీల్దారు కె.సూర్యారావు, ఎంపిడిఒ ఎం.రామకృష్ణారెడ్డి పరిశీలించారు. తాళ్లపూడి గోదావరి నదికి ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో భారీగా వరద పెరిగింది. గోదావరి నదికి స్నానాల కోసం, చేపల వేట కోసం వెళ్లవద్దని తహశీల్దారు టి.రాధిక హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బందితో మండలంలోని అన్ని గోదావరి రేవులనూ ఆమె పరిశీలించారు. సీతానగరం గోదావరినదిలో వరద ఉధతి కారణంగా బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల మధ్య రోడ్డు మార్గం నీట మునిగింది. రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నదిపై రాకపోకల కోసం అధికారులు మర బోట్లు ఏర్పాటు చేశారు. నదీ తీరంలో గోదావరి లంకలు నీటమునిగాయి. వరద పెరిగిన కారణంగా ములకల్లంక నుండి పురుషోత్తపట్నం వరకూ ఉన్న ఏటుగట్టుకు వరద తాకిడి ఎక్కువవుతోంది.