ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేసిన వైసిపికి పాలించే అర్హత ఎక్కడదని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి.అరుణ్, తాటిపాక మధు ప్రశ్నించారు. గురువారం రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ధర్నా నిర్వహించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిఎ బకాయిలు విడుదల చేయాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు మాట తప్పి ఇప్పుడు జిపిఎస్ అంటున్నారని విమర్శించారు. ఒక్కసారి కూడా డిఎస్‌సి పెట్టలేదని, 1998 బ్యాచ్ సమస్య కూడా పరిష్కారం కాలేదని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా, మభ్యపెట్టి, మైమరపించి మోసం చేస్తున్నారని అన్నారు. మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పి మాట తప్పారని, మడమ తిప్పారని విమర్శించారు. రకరకాల యాప్‌ల పేరుతో టీచర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారని, దీనివల్ల వారు ఒత్తిడికి లోనై చనిపోతున్నారని తెలిపారు. బాపట్ల జిల్లాలో జరిగిన తాజా ఘటన ప్రస్తావించారు. కరోనా కాలంలోనూ 35 మంది టీచర్లు ప్రాణాలు వదిలారని తెలిపారు. ఈ కాలంలో ఒత్తిడికి లోనై ఐదుగురు టీచర్లు బలయ్యారని చెప్పారు. బైజూస్‌కు సేవ చేయకపోతే విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ రంగంలోకి దిగుతారని, ఉపాధ్యాయులను నోటీసుల రూపంలో వేధిస్తూ, హింసిస్తున్నారని అన్నారు. ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ డబ్బు రూ.3 వేల కోట్లను వాడుకునేందుకూ ఉద్యోగులకు అవకాశం లేకుండా చేశారని, ప్రభుత్వమే దోచుకుందని విమర్శించారు. జీతాలూ సకాలంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూల్ టీచర్లకైతే అసలు భద్రతే లేదని పేర్కొన్నారు. ప్రైవేటు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ చట్టం తేవాలని కోరారు. చిన్న స్కూళ్లపై వేధింపులు ఆపాలని డిమాండు చేశారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి నేరుగా జోక్యం చేసుకుని గెలవాలని కిందిస్థాయి ప్రజాప్రతినిధులకు సిఎం స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం దాని కోసం అడ్డదారులు తొక్కడం సిగ్గుచేటన్నారు. సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై తీవ్ర నిర్బంధాన్ని, అణచివేతను ఉపయోగిస్తూ అరెస్టులు, షోకాజ్ నోటీసులతో నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని విడనాడి సిపిఎస్ రద్దుతో సహా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నింటిని తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు, సుందర బాబు, నాయకులు ఎస్‌ఎస్.మూర్తి, టిఎస్.ప్రకాష్, పోలిన వెంకటేశ్వరరావు, టి.సావిత్రి, పడాల రామకష్ణ, పూర్ణిమరాజ్, అప్పలనరసయ్య, వెంకటలక్ష్మి, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, కె.జోజిరాజు, చప్పా రమణ, ఎంఎస్.రాజు, కె.రామకష్ణ, సునీల్, నల్లా రామారావు, యడ్ల లక్ష్మి పాల్గొన్నారు.










