ప్రజాశక్తి - గోపాలపురం
హామీలు అమలు చేయాలని, డిమండ్లను నెరవేర్చాలని తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ఒక రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్‌రాజు మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను గాలికి వదిలేసి, ఎన్నడూ చూడని విధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వంగా వైసిపి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగుల ఆశలను నీరుగార్చారన్నారు. తమకు రావాల్సిన డిఎలు, ఎరియర్స్‌ను అడుగుతుంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన జీతాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజున అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎంవివి.సత్యనారాయణ, ఎంఎస్‌ఎస్.కుమారి, సుందరి, కృష్ణ, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.










