ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో కంటింజెంట్ వర్కర్లుగా పనిచేస్తున్న స్కూల్ ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ స్వీపర్స్ యూనియన్ నాయకులు మంగళవారం డిఇఒ ఎస్.అబ్రహాం కి విమతిపత్రం అందజేశారు. సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానని డిఇఒ వారికి తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, మున్సిపల్ స్కూల్ స్వీపర్స్ యూనియన్ నాయకులు ఝాన్సీ మాట్లాడారు. 40 ఏళ్లుగా నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో కంటెంజెంట్ వర్కర్లుగా పనిచేస్తున్నామన్నారు. స్కూల్ స్వీపర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మున్సిపల్ స్కూల్స్‌ని జిల్లా విద్యా శాఖలో విలీనం చేసిన నేపథ్యంలో స్కూల్స్ ఆయాల ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. మున్సిపల్ అధికారులు, విద్యాశాఖల మధ్య సమన్వయంతో స్కూల్ స్వీపర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. పార్ట్ టైం వర్కర్లుగా నియమించినప్పటికీ ఉదయం 8 నుంచి సాయంత్రం స్కూల్ ముగిసేవరకు పనిచేయిస్తున్నారని, జీతం మాత్రం పార్ట్ టైం వర్కర్‌కి ఇచ్చే రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. కార్పొరేషన్ అధికారులు, విద్యా శాఖ అధికారులు సమన్వయంతో స్కూల్ స్వీపర్ల వేతన బకాయిలు ఇవ్వాలని, ఏప్రిల్ జీతాల బిల్లులు తీసుకుని జీతాలు మంజూరు చేయాలన్నారు. కనీస వేతనం రూ.12వేలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం.మంగతాయారు, ఎన్.సత్యవతి పాల్గొన్నారు.
డిఇఒకు వినతిపత్రం అందిస్తున్న ఆయాలు










