Feb 18,2023 00:15

ఉద్రిక్తత
- అనపర్తిలో బాబు పర్యటనను అడ్డుకున్న పోలీసులు
- ప్రతిఘటించిన టిడిపి శ్రేణులు - కాలినడక సభాస్థలికి అధినేత
ప్రజాశక్తి - కాకినాడ, రాజమండ్రి ప్రతినిధులు సామర్లకోట, సామర్లకోట రూరల్‌
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన పర్యటనలో మూడో రోజైన శుక్రవారం ఉద్రిక్తత చోటుచేనసుకుంది. కాకినాడ జిల్లాలో పర్యటన అనంతరం ఆయన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చేరుకునేందుకు బయలు దేరారు. అనపర్తి దేవీచౌక్‌ వద్ద ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడాల్సి ఉంది. ఆయన కాన్వారు సామర్లకోట నుంచి అనపర్తి నియోజక వర్గంలోని బలభద్రపురం చేరుకునే సరికి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనం దిగి కాలినడకన సుమారు ఏడు కిలోమీటర్ల మేర నడిచి అనపర్తి దేవీచౌక్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడా ఆయన్ని అడ్డుకునేందుకు పోలీసులు బారి కేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో టిడిపి నాయకులు, కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ చంద్రబాబును సభాస్థలికి తీసుకొచ్చారు. సభ జరగకుండా మైక కట్‌ చేశారు. జనరేటర్లకు తాళాలు వేయించారు. చీకటి మయంగా మారడంతో కార్యకర్తలు సెల్‌ఫోన్‌ లైట్లను వేసి అధినేతకు సంఫీ ుభావం తెలిపారు. దీంతో టిడిపి నాయకులే తాళాలలు బద్దలగొట్టి జనరేటర్లను ఆన్‌ చేయించారు.అనంతరం చంద్రబాబు మాట్లాడారు.
సైకో పాలనకు ప్రజలే స్వస్తి పలకాలి
రాష్ట్రంలో జరుగుతున్న సైకో పాలనకు ప్రజలే స్వస్తి
పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సైకో పాలనలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. అన్ని రంగాల కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలులో స్థానిక ఎంఎల్‌ఎ వాటాలు వసూలు చేస్తున్నారని, గ్రావెల్‌ మాఫియాకు అనపర్తి నియోజకవర్గం అడ్డాగా మారిందని వివరించారు. రూ.400 కోట్ల లేటరైట్‌, గ్రావెల్‌ దోచుకునే ప్రయత్నాన్ని అడ్డుకున్న ఘన చరిత్ర నల్లమిల్లి రామకృష్ణారెడ్దిదేనని అభినందించారు. అనపర్తిలో తనను అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు. గ్రావెల్‌ సూర్యనారాయణ ఖబడ్దార్‌ అంటూ అనపర్తి ఎంఎల్‌ఎను హెచ్చరించారు.
దళితులకు అండగా ఉంటాం...
టిడిపి ఎప్పుడూ దళితులకు అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సామర్లకోట నవభారత్‌ వెంచర్స్‌ పరిశ్రమ అతిథిగృహం ఆవరణలో మాజీ మంత్రి జవహర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దళిత సదస్సులో ఆయన మాట్లాడారు. దళితుల కోసం జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ వేశామని గుర్తు చేశారు. ఆయన నివేదిక ప్రకారం పలు పథకాలను అమలు చేశామన్నారు. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌ను చేశామని, కాకి మాధవరావును చీఫ్‌ సెక్రటరీగా, జిఎంసి బాలయోగిని లోక్‌ సభ స్పీకర్‌గా చేసిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. అవినీతి, దోపిడినీ ప్రశ్నించిన దళితబిడ్డలకు శిరోముండనాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ఎంఎల్‌సి ఒక దళితుడిని చంపేసి డోర్‌ డెలివరీ చేశారన్నారు. దళిత నిధులను నవరత్నాలకు మళ్లించిన జగన్‌ రెడ్డి దళితద్రోహిగా మిగిలిపోయాడన్నారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్‌ తన అనుచరుగణంతో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, యనమల రామకృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు, పెద్దాపురం ఎంఎల్‌ నిమ్మకాయల చినరాజప్ప, టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేట్ల పాలెంలో నిరసన సెగ
సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఏర్పాటు చేసిన మాజీ ఎంఎల్‌సి బొడ్డు భాస్కరరామారావు విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. టిడిపి ముద్దు.. రాజప్ప వద్దు.., రాజప్ప గో బ్యాక్‌ అంటూ బొడ్డు భాస్కరరామారావు తనయుడు వెంకటరమణ చౌదరి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబు జోక్యం చేసుకుని సముదాయించారు. వైసిపి పాలనను అంతమొందించాలని, చినరాజప్పను మరోసారి గెలిపించు కోవాలని సూచించారు. వెంటకరమణకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో బొడ్డు భాస్కరరామారావు ఒక ధ్రువవ తారగా వెలుగొందారన్నారు. ఆయన మరణం దురదృష్టకరమన్నారు. ఈ టిడిపి నాయకులు గుణ్ణం చంద్రమౌళి, మాజీ ఎంపిపి కొండపల్లి కృష్ణమూర్తి, అడబాల కుమారస్వామి, కంటే బాబు పాల్గొన్నారు.
అనపర్తి దేవీచౌక్‌ వద్ద బహిరంగ సభలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు.