Jul 12,2023 22:05

ఇంటర్‌ పాఠ్యపుస్తకాలపై చేతులెత్తేసిన సర్కారు
ఆందోళనలో విద్యార్థులు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ ఏడాది పాఠ్య పుస్తకాలు పంపించలేమంటూ ఇంటర్మీడియట్‌ బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇంటర్మీడియట్‌ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులపైగా గడిచింది. ఇప్పటికీ ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించలేదు. ఇంటర్‌ విద్యామండలి నిధులతో పాఠ్యపుస్తకాలను విద్యా సంవత్సరం ప్రారంభంలో పంపిణీ చేయాల్సి ఉంది. పుస్తకాల ముద్రణపై స్పష్టత కొరవడడంతో పుస్తకాలు అందే పరిస్థితి కన్పించట్లేదు. జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో స్టాక్‌ ఉన్న కొన్ని పుస్తకాలను అరకొరగా విద్యార్థులకు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. పుస్త్తకాలు లేకుండా తమ పిల్లలు ఎలా చదువుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నిస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 39900 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 42 వేల మంది ఉన్నారు. వీరిలో 30 శాతానికి పైగా ప్రభుత్వ, సంక్షేమ కళాశాలలో చదువుతున్నారు. ప్రభుత్వం సకాలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకపోవడంతో గతేడాది సీనియర్ల వద్ద సేకరించిన పుస్తకాలను జూనియర్లకు అందజేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పాత పుస్తకాల ద్వారానే విద్యార్థులు పాఠ్యాంశాలను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ఎపిఆర్‌జెసి, కెజిబివి, ఎపి మోడల్‌, సాంఘిక సంక్షేమ, ఎపి ట్రైబల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలల ఉన్నాయి. ఆయా కళాశాలలో అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. జిల్లాల విభజన తర్వాత ప్రతి మండలంలో ఓ బాలికల జూనియర్‌ కళాశాలను(హైస్కూల్‌ ప్లస్‌)ఏర్పాటు చేశారు. వీటిలో చేరిన విద్యార్థులక్కూడా ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలు అందించాలి. దీనికితోడు జిల్లాలో ఇంటర్‌బోర్డు గుర్తింపు ద్వారా నడుస్తున్న ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకూ ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు ముద్రించి విక్రయించాల్సి ఉంది. ప్రభుత్వ పంపిణీ చేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడింది. పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు కలిపి సుమారు రూ.2వేలకు ఖర్చు అవుతుంది.
ఇంటర్‌ విద్య పై ప్రభుత్వ నిర్లక్ష్యం
విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు నేతిబీర చందంగా మారాయి. విద్యా దీవెన అమ్మ ఒడి పథకాల పేరుతో నగదు అందజేస్తున్నామంటూ ప్రచారం చేస్తుంది. విద్యార్థుల అభ్యసనలో కీలకమైన పాఠ్యపుస్తకాలు అందజేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని అనుసరిస్తుంది. కరోనా వైరస్‌ కారణంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ ఫలితంగా ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయింది. గతేడాది ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాల్లో జిల్లా వెనుకబడిన విషయం విధితమే. గత అనుభవాల నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపించాల్సి ఉన్న పూర్తి భిన్నంగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.
పాఠ్యపుస్తకాలు అందించే అవకాశం లేదు
ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు అందించే అవకాశం లేదు. ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. అకాడమీ పుస్తకాలు బహిరంగ మార్కెట్లో అందుబాటు ధరల్లో ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసుకోవాలని విద్యార్థులకు సూచించాము. ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంపునకు కషి చేస్తున్నాం.
- నరసింహం, ఆర్‌ఐఒ, తూర్పుగోదావరి జిల్లా