- రూ.12 లక్షలు సోరి సొత్తు స్వాధీనం.
ప్రజాశక్తి-కడియం : ఒంటరిగా ఎన్ని నేరాలు చేసినా ఎవరికి చిక్కననే సిద్ధాంతాన్ని బలంగా నమ్మి గత జనవరి నెల నుండి వరుస దొంగతనాలకు పాల్పడుతూ కడియం పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసిన యువకుడ్ని ఎట్టకేలకు వలపన్ని కడియం పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి సౌత్ జోన్ డి.ఎస్.పి శ్రీనివాసులు కడియం పోలీస్ స్టేషన్ వద్ద ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో గత జనవరి నెల నుండి జూన్ వరకు 5 వరుస దొంగతనాలు జరగడంతో దీనిపై కడియం సిఐ పివిజి తిలక్ ప్రత్యేక దృష్టి సారించి క్రైమ్ బ్రాంచ్ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో వారిదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. కడియపులంక కాలువ రేవు (చాకలి రేవు) వద్ద అనుమానస్పదంగా సంచరిస్తున్న బుర్రిలంక గ్రామానికి చెందిన డేగల శ్రీనివాసును విచారించగా బుర్రిలంకలో జరిగిన ఐదు దొంగతనాలు తనే చేసినట్లు నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుండి షుమారు 202.218 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 30 తులాల వెండి వస్తువులు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని డిఎస్పి వెల్లడించారు. ముద్దాయి చెడు వ్యసనాలకు బానిసై డబ్బులు కొరకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే ముద్దాయిని పట్టుకోవడంలో చాకసఖ్యంగా వ్యవహరించిన క్రైమ్ బ్రాంచ్ సురేష్ బాబు, లక్ష్మణ్, ప్రసన్నకుమార్ లను డిఎస్పితో పాటు ఎస్పీ అభినందించారు.










