May 16,2023 23:32

వడగాల్పులతో జనం బెంబేలు
నిర్మానుష్యంగా ప్రధాన కూడళ్లు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండలకు తోడు వడగాల్పులు వీచడంతో పలుచోట్ల జన జీవనం స్తంభించింది. ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాలంటేనే వాహనచోదకులు వెనకడుగు వేస్తున్నారు. విద్యుత్‌ సరఫరాలో అనధికార కోతలతో ఇళ్లలో ఉండేవారూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ నేపధ్యంలో ఉదయం 11 గంటల తర్వాత నుంచి అనేక కూడళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. మార్కెట్‌ సముదాయాల్లో వ్యాపారులు మధ్యాహ్నం వేళ తమ షాపులను మూసివేసి సాయంత్రం తెరిచారు. పండ్లు, కూరగాయలు, కొబ్బది బోండాలు తదితర సీజనల్‌ వ్యాపారులు, రోజువారీ, ఉపాధీ కూలీలు, రవాణా రంగ కార్మికులు నిప్పుల కొలిమిలోనే తమ విధులు నిర్వహించారు. మరో వారం రోజులు ఇదే విధంగా గాల్పులు ఉంటాయనడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలో ఉష్ణోగ్రతలు పైపైకి
జిల్లాలో ఈ ఏడాది గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతన్నాయి. గడిచిన ఏడాది వేసవిలో జిల్లాలో సరాసరిన 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఒకట్రెండు రోజులు మాత్రమే నాడు ఈ పరిస్థితి తలెత్తింది. కాని రెండ్రోజులుగా 45 డిగ్రీల సెల్సియస్‌ మైలు రాయిని చేరింది. ఎండలతో ఎసిలు, ఫ్యాన్లకు డిమాండ్‌ పెరిగింది. విద్యుత్‌ ఉపకరణాలు అమ్మే షాపులలో రద్దీ నెలకొంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా విసనకర్రల క్రేజీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికే శీతల పానీయాలకు సంబంధించిన వ్యాపారాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గతంలో ఒకేచోట స్థిరమైన వ్యాపారాలు ఉండేవి. కానీ ఇప్పుడు మొబైల్‌ వ్యాపారాలతో జనసంచార ప్రాంతాల్లో వ్యాపారులు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ విక్రయాలు చేస్తున్నారు. అదే విధంగా చెరకు రసం, సోడాలు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు, లస్సీ, పండ్ల రసాలు, మజ్జిగ విరక్రయ వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఈ చల్లని పానీయాలను తాగుతూ సేదతీరుతున్నారు. దీంతో ఆయా వ్యాపారాలు రెండ్రోజులుగా ఊపందుకున్నాయి.
వేతన జీవులకు తప్పని వెతలు
ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో ఉన్నప్పటికీ వేతన జీవులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధి కూలీలు ఎండలోనే పనులు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ముఠా కార్మికులు, చిరు వ్యాపారులు మధ్యాహ్నం వేళల్లో సైతం తమ బాధ్యతలను నిర్వర్తించారు. రవాణా రంగ కార్మికులు భానుని ప్రతాపం తాళలేక అవస్థలు పడటం కన్పించింది. వడదెబ్బ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. తల తిరగడం, తలనొప్పి, సొమ్మసిల్లి పడిపోయే లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. నాలిక పొడిబారిపోయినట్లు అనిపిస్తే రక్త నాళాలు వ్యాకోచించి మెదడుకు సరిగ్గా రక్తం అందటం లేదని సూచనగా భావించాలి. ఈ పరిస్థితిని హీట్‌ సింకోప్‌ అని కూడా అంటారు. రాత్రివేళలో కాలిపిక్కలు పట్టేసినట్లు, తీవ్రమైన నొప్పి మొదలవటం, శరీరంలో లవణాలు కోల్పోవడం వల్ల కండరాలకు మెదడు నుంచి ఆదేశాలు సరిగ్గా అందకపోవటం వంటివి గుర్తించకపోతే స్పృహ తప్పిపోయే ప్రమాదమూ పొంచి ఉంది.
అప్రమత్తత తప్పనిసరి
ఈ వేసవిలో వడదెబ్బ తగిలినట్లు గుర్తిస్తే నీళ్లు, ఒఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగిస్తే ఫలితం ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లకూడదు. ఏదైనా పని ఉంటే ఉదయం 11గంటల లోపు, సాయంత్రం 4 తర్వాత చేసుకునేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలి.చేపలకు ప్రాధాన్యం ఇవ్వాలి.- మద్యం, సిగరేట్‌, బిర్యానీలు, మసాలాలు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఎండలు ఇప్పటికే తీవ్రమయ్యాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు సంభవించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
వేసవి నేపథ్యంలో వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. గొడుగు లేదా తెల్లని టోపీ పెట్టుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసంగా 3 లీటర్లు మంచినీళ్లు తాగాలి. పుచ్చకాయ, నిమ్మకాయ, కీరదోసలు ఎక్కువగా తినాలి. అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లయితే వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలి. అన్ని పిహెచ్‌సిల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులను అప్రమత్తం చేశాము.
- డాక్టర్‌ వెంకటేశ్వరరావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి