ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
'తూర్పు'న తొలి ఎన్నికల పొత్తు పొడిచింది. రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని సెంట్రల్ జైల్ సాక్షిగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. పొత్తులపై ఇప్పటి వరకూ ఊగిసలాడిన జనసేనాని ఎట్టకేలకు టిడిపితో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బిజెపి కూడా తమకు కలిసివస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవన్‌కళ్యాణ ప్రకటనతో టిడిపి కేడర్‌లో ఉత్సాహం కనిపిస్తుంది. పలువురు నేతలు పొత్తుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'స్కిల్' స్కామ్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ములాఖత్‌లో భాగంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సినీనటుడు, ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ గురువారం కలిశారు. ఈ సమయంలో సెంట్రల్ జైలు వద్ద భారీ ఆంక్షలు విధించారు. జనసేన, టిడిపి కార్యకర్తలు, పవన్, బాలకృష్ణ అభిమానులు అక్కడి రాకుండా చర్యలు తీసుకున్నారు. 40 నిమిషాల ములాఖత్ అనంతరం లోకేష్, బాలకృష్ణలతో కలిసి పవన్‌కళ్యాణ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రస్తుతం జరిగిన ములాఖత్ రాష్ట్ర ప్రజలకు చాలా అవసరమన్నారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలనే పొత్తు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. నాలుగేళ్ల వైసిపి పాలన అంతా అరాచకంగా సాగిందన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరులేకున్నా కావాలనే కక్షపూరితంగా చంద్రబాబుపై కేసులు పెట్టి రిమాండ్‌కు పంపిం చారన్నారు. చంద్రబాబుకు తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవన్నారు. ఇది ఆయన వద్ద స్పష్టం చేశానని తెలిపారు. విధానపరమైన విషయాల్లో విబేధాల కారణంగానే నాడు ఒంటిరిగా పోటీ చేశామని తెలిపారు. దేశానికి బలమైన నాయకుడు కావాలని భావించానని అందువల్లే మోడీకి మద్దతు ఇచ్చానని తెలిపారు. నాటి నుంచి నేటి వరకూ మోడీ పిలుపు మేరకే కలిశానిని తెలిపారు.
విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం చేయలేకపోయిందని, ఆ సమయంలో సగటు మనిషి ఆవేదననే ఆనాడు మాట్లాడానన్నారు. చంద్రబాబు అనుభవాన్ని, శక్తి, సామర్థ్యాలను తాను ఎప్పుడూ తక్కువ చేయలేదన్నారు. హైటెక్ సిటీ వంటి వాటిని నిర్మించి వేలకోట్ల ఆదాయాన్ని సమకూర్చిన వ్యక్తిపై రూ.371 కోట్లతో అక్రమాలు జరిగాయని అభియోగం మోపి జైల్లో పెట్టడం సమంజసం కాదన్నారు. జగన్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, వాలంటీర్ల ద్వారా డేటా చోరీ చేస్తున్నారని తెలిపారు. ఏ హామీ నిలబెట్టుకోని వ్యక్తి ఇప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్నారు. శాంతిభద్రతల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని తెలిపారు. వైసిపి పాలన భరించలేకే వైసిపి వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పానన్నారు. జగన్ సొంత చెల్లి, తల్లిని బయటకు పంపాడు. బాబారు ని చంపిన వ్యక్తిని వెనకేసొచ్చాడు. జగన్‌ను అధికారులు నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే ఉంటుందని తెలిపారు. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తే తామూ కూడా మాట్లాడాల్సి వస్తుందన్నారు. రేపటి నుంచే జనసేన, టిడిపి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తాయాని తెలిపారు. పోటీ చేసే అంశాన్ని కేంద్రానికి కూడా తెలియజేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐక్యంగా ఏం చేయాలో ఆలోచిస్తామని, తర్వాత ఎలా పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో తమకు తెలుసునని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై బిజెపి కుట్ర ఉందన్న అంశాన్ని తాను నమ్మట్లేదన్నారు. ప్రతి అంశానికీ బిజెపి పెద్దలు స్పందించాలనడం కూడా కరెక్టు కాదనన్నారు.










