ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ధర్నా
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం, కాకినాడ, తాళ్లరేవు, నిడదవోలు
సర్దుబాటు ఛార్జీలపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తగా ధర్నాలు చేశాయి. స్మార్ట్ మీటర్ల ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశాయి.
రాజమహేంద్రవరంలో వై.జంక్షన్ వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాకినాడలో ఎలక్ట్రికల్ డిఇ కార్యాలయం వద్ద, తాళ్లరేవు సబ్‌స్టేషన్ వద్ద ధర్నాలను నిర్వహించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కె.రాంబాబు, న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కరెంట్ బిల్లు చుడగానే ప్రజలు షాక్‌కు గురవుతున్నారన్నారు. ఇప్పటికే స్లాబులు మార్చి భారం మోపారని, ఇప్పుడు ప్రజల కళ్లుగప్పి ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. తాజాగా వచ్చే నాలుగేళ్లలో రూ. 31 వేల కోట్ల భారం ప్రజలపై మోపనున్నారని తెలిపారు. ఈ మే నెల బిల్లులో 2014లో వాడుకున్న కరెంటుకు మళ్లీ యూనిట్‌కు 20 పైసలు, 2021 మే నెలలో వాడిన విద్యుత్‌కు యూనిట్‌కు మరో 20 పైసలు, 2023 ఏప్రిల్ నెలలో ఉపయోగించిన కరెంట్ యూనిట్‌కు 40 పైసలు కలిపి కరిపి మొత్తం 80 పైసలు చొప్పున భారం మోపారన్నారు. విద్యుత్ రంగాన్ని అదాని కంపెనీలకు కట్టాబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో 30 ఏళ్లపాటు వ్యవసాయానికి అవసరమయ్యే విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు అదానీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం ద్వారా మోడీ, జగన్‌లు జేబులు నింపుకుంటున్నారన్నారు. ట్రూ అఫ్ ఛార్జీల భారాన్ని, విద్యుత సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రత్తిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, నాయకులు ఎస్‌ఎస్.మూర్తి, బి.పూర్ణిమరాజు, పోలిన. వెంకటేశ్వరావు, రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, రాజా, రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, నాయకులు నల్లా. రామారావు, రామకృష్ణ, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు కె.జోజి, పిడిఎస్‌యు జిల్లా నాయకులు కె.భానుప్రసాద్, పిడిఎస్‌యు పట్టణ కార్యదర్శి ధర్మేష్ బాబు, పిఒడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు పి.విజయ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఎ.అర్జునరావు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఆర్‌పిఐ రాష్ట్ర నాయకులు ఎ.రామేశ్వరరావు మాట్లాడారు. విద్యుత్ భారాలతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లు ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నారని ప్రశ్నించారు. అదానీ, షిర్డీ సాయి కంపెనీలు కోసం ప్రజలను దోచుకుంటారా అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో మరో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇలాంటి భారాలు వేసిన గత ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పారని గుర్తు చేశారు. పది వేల కోట్ల భారాలు వేస్తున్న జగన్‌ను ప్రజలు ఇరవై ఏళ్లు ఇంట్లో కూర్చో పెడతారని హెచ్చరించారు. మోడీ మాయలో పడి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాలను తు.చ తప్పకుండా జగన్మోహన్ పాటిస్తున్నారన్నారు. బిజెపి ప్రభుత్వం తెచ్చే విషమ షరతులను జగన్ ఆచరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, సిహెచ్. రమణి, కె.సత్తిరాజు, సిహెచ్. రాజ్ కుమార్, కె.వీరబాబు, సిహెచ్.పద్మ, మలకా రమణ, ఎం.రమణ, అజరుకుమార్, సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, పి.ఎస్.నారాయణ, పెదిరెడ్ల సత్యనారాయణ, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, సిహెచ్.నాగేశ్వరరావు, ఎం.లచ్చిబాబు, న్యూ డెమోక్రసీ నాయకులు ఎం.రాజు పాల్గొన్నారు.
తాళ్ళరేవు సబ్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నాలో సిపిఎం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. ప్రభుత్వం ఒకేసారి సర్దుబాటు చార్జీల పేరుతో మూడు పోట్లు పొడిచిందన్నారు. రానున్న కాలంలో స్మార్ట్ మీటర్లు పెట్టి సామాన్యులను దోచి కార్పొరేట్లు జేబులు నింపడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలన్నార. ఈ కార్యక్రమంలో వి.రాజబాబు, డి.అదృష్టదీపుడు, ఎన్.త్రిమూర్తులు, ఎ.బాబూరావు, వి.ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.
నిడదవోలు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఆదేశాలకు లొంగిపోయిన జగన్ ప్రభుత్వం ప్రతినెలా ఏదోరూపంలో ప్రజలపై భారం మోపుతుదంన్నారు. ట్రూఅప్ ఛార్జీలు అందులో భాగమేనన్నారు. కేంరద, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గారపాటి ప్రసన్నకృష్ణ, దిడ్ల సత్యనారాయణ, సారిక శ్రీను, నరేంద్ర, శ్యామ్, పండు, ఏసు, రవి తదితరులు పాల్గొన్నారు.










