ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు రాజమహేంద్రవరం పోస్టల్ డివిజనల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తపాలా డివిజన్ గ్రూప్ సి యూనియన్ కార్యదర్శి బి. కొండబాబు మాట్లాడుతూ కాలం చెల్లిన కంప్యూటర్లు, ప్రింటర్లను మార్చకుండా, తగిన నెట్వర్క్ సదుపాయాలు కల్పించకుండా రోజువారీ లక్ష్యాలను నిర్దేశించడం తగదన్నారు. లక్ష్యాల పేరుతో నిత్యం ఉద్యోగులను వేధింపులకు గురిచేయటం మానుకోవాలని కోరారు. పోస్టుమెన్ యూనియన్ కార్యదర్శి జెవి.సతీష్ మాట్లాడుతూ ఉత్తరాలు బట్వాడా సమాచారాన్ని పోస్టుమెన్లు తమ సొంత మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ అప్డేట్ చేయాలని వేధించడం, అధికారులు నిర్దేశించిన బట్వాడా లక్ష్యాలను పూర్తి చేయలేని ఉద్యోగులను కక్షపూరితంగా వేధించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల జిల్లా కార్యదర్శి ఆర్.పుష్కరం మాట్లాడుతూ చిరుద్యోగులైన జిడిఎస్‌కు రిటైర్మెంట్ సమయంలోనే వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందజేయాలన్నారు. సంఘాల నాయకులు యుజి.ప్రకాష్, ఐ. శ్రీనివాస్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.










