ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
తపాలా శాఖ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న జాతీయ తపాలా ఉద్యోగుల సమాఖ్య(ఎన్‌ఎఫ్‌పిఇ), అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం(ఎఐపిఇయు) గుర్తింపు రద్దు చేయడం అన్యాయమని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం రాజమండ్రి డివిజన్ కార్యదర్శి బి.కొండబాబు అన్నారు. ఈ చర్యను నిరసిస్తూ రాజమహేంద్రవరం ప్రధాన తపాలా కేంద్రం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమానికి ఆర్థిక సాయం చేశారనే కారణంగా రెండు యూనియన్ల గుర్తింపును రద్దు చేయడం దారుణమన్నారు. 70శాతం ఉద్యోగులు సభ్యులుగా ఉన్న ఈ రెండు యూనియన్ల గుర్తింపు రద్దుకు వ్యతిరేకంగా రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఒక గుర్తింపు లేని ఉద్యోగ సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ రెండు యూనియన్ల గుర్తింపు రద్దు చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో వివిధ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు తపాలా యూనియన్లకు మద్దతు ప్రకటించాయన్నారు. గుర్తింపు పునరుద్ధరించే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రెసిడెంట్ యుజి.ప్రకాష్, తపాలా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రామలింగేశ్వరరావు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్స్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.










