Feb 03,2023 22:51

ప్రజాశక్తి-గోపాలపురం పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. శుక్రవారం గోపాలపురం చెక్‌ పోస్ట్‌ సెంటర్‌ వద్ద పార్టీ ఆధ్వర్యాన అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ ప్రతి పేదవానికీ పట్టెడు అన్నం అందించేందుకు 2014లో పలు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయగా వైఎస్‌.జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్‌లను నిర్వీర్యం చేశారన్నారు. టిడిపి అధికారంలో లేకపోయినప్పటికీ గోపాలపురంలో పార్టీ నాయకులు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి శుక్రవారం పేదవారికి కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్‌ ప్రారంభించడం ఎంతో గర్వకారణమని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి ప్రతిరోజు ఆహారం అందిస్తామని హామీ ఇచ్చారు. పేదవారి కడుపు నింపే తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో తెచ్చేందుకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.