Jun 03,2023 23:35

రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ సంటర్‌

ఒడిశా ఘటనతో జిల్లాలో భయాందోళన
జిల్లాకు చెందిన వారి ఆచూకీ కోసం ముమ్మర
ప్రయత్నం
4 అందుబాటులోకి హెల్ప్‌లైన్‌ నెంబర్లు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ఒడిశాలో జరిగిన రైల్వే దుర్ఘటనతో జిల్లాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గంట గంటకూ మృతుల సంఖ్య పెరగటంతో ప్రయాణీకుల బంధవులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దుర్ఘటనలో తెలుగువారు 100కు పైగా ఉన్నారనే వార్తలు అందరినీ కలచి వేస్తున్నాయి. జిల్లాకు చెందిన ప్రయాణికులు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌(12841)లో 31 మంది, బెంగళూరు-హౌరా(12864)లో ముగ్గురు రిజర్వేషన్‌ బోగీల్లో ప్రయాణించినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 25 మంది ప్రయాణికులు వారి గమ్య స్థానాలకు చేరినట్లు ధృవీకరించారు. మరో 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి ఫోన్‌ నెంబర్లు అందుబాటులోకి రాకపోవడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం హెల్ప్‌ లైన్‌ నెంబర్లు అందుబాటులోకి తీసుకురావడంతో తమ వారి వివరాలను అందజేస్తున్నారు. జనరల్‌ భోగీల్లో ప్రయాణించే వారి వివరాలు తెలియాల్సి ఉంది.
కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బి5 బోగీలో డి.ఇందిరకుమారి(59), డి.లోకేష్‌(36)ల ఆచూకీ తెలియరాలేదు. ఈ నలుగురు రిజర్వేషన్‌ సమయంలో ఫోన్‌ నెంబరు ఇవ్వలేదు. బి6 బోగీలో రాజేష్‌రామ్‌ (39), బి8 బోగీలో బి.పంజా(54)మొబైల్‌ నెంబర్‌లు ఉన్నా అవి పనిచేయట్లేదు. వీటిని ట్రేస్‌ అవుట్‌ చేస్తున్నారు. ఎటపాక మండలం పి.గన్నవరానికి చెందిన ఎస్‌3 బోగీలో ప్రయాణిస్తున్న ఫగురామ్‌ ముర్ము(48), సుశాంతి(40), అభిషిక్త్‌ (11) మొబైల్‌ నెంబర్లు సైతం నాట్‌ వర్కింగ్‌ అని రావడంతో అధికారులు సిగల్స్‌ ఆధారంగా ట్రేస్‌ అవుట్‌ చేస్తున్నారు.
గమ్యస్థానాలకు 25 మంది
రెండు రైళ్లలో బయలు దేరిన ప్రయాణికుల్లో 25 మంది వారి గమ్య స్థానాలకు చేరినట్లు అధికారులు ధ్రువీకరించారు. కోరమాండల్‌ హెచ్‌1 భోగీలో జిల్లాకు చెందిన జి. వివేక్‌, జి.సత్యవతి, బి3లో కె.లక్ష్మణరావు, కె.సుభాషిణి పశ్చిమ బెంగాల్‌ చేరినట్లు తెలిసింది. అదే భోగీలోనీ శ్రీమంత సమంత్‌ కలకత్తా చేరారు. బి4లో సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ అనుప్‌ కుమార్‌, అనామిక కుమారి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ద్వారా రాజమండ్రి చేరుకున్నారు. బి6 ప్రయాణికులు బసంత కాకాటి, లఖన్‌ రారు రాజమండ్రి చేరుకుని ఛత్తీస్‌గడ్‌కు పయనమయ్యారు. బి8కి చెందిన వై.మురళీకృష్ణ సురక్షితంగా రాజమండ్రి చేరుకున్నారు. బి9 ప్రయాణికులు పి.సుబ్బారావు బస్సు మార్గం ద్వారా కొవ్వూరుకు చేరుకున్నారు. అదే భోగీ ప్రయాణికులైన సుర్జారారు తిరిగి వెస్ట్‌బెంగాల్‌ చేరుకున్నారు. ఎస్‌1 ప్రయాణికులైన ఎండికె.అన్సారీ వెస్ట్‌బెంగాల్‌ చేరుకున్నారని తెలిపారు. ఎస్‌2 ప్రయాణికులైన హరిబాబు, అన్నపూర్ణ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి చేరుకున్నారు. అదే భోగీలో ప్రదీప్‌ గురు, కె. హేమంత్‌, ఎస్‌3లో వేణుకుమార్‌, జి. జగదీష్‌ వెస్ట్‌బెంగాల్‌ చేరుకున్నట్లు తెలిపారు. అదే భోగీకి ప్రయాణీకులైన డి.నవీన్‌ భువనేశ్వర్‌, సరోజ్‌కుమార్‌, ఎం యుగంధర్‌ వెస్ట్‌ బెంగాల్‌ చేరుకున్నట్లుతెలిపారు. బెంగళూరు- హౌరా ప్రయాణికులు ముగ్గురూ పాట్నా చేరుకున్నట్లు తెలిపారు.
ఒడిశా దుర్ఘటన బాధాకరం : ఎంపీ భరత్‌
ఒడిశా లోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం అత్యంత దురదష్టకరమని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి సమాచారం తెలియగానే ఆయన రాజమండ్రి రైల్వే స్టేషనుకు వెళ్ళి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతం మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన వెంట ఛీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ మౌళి చంద్రా, డిప్యూటీ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణ్‌ ఆకుల, ఆర్‌పిఎఫ్‌ జిఆర్‌పి స్టాప్‌ ఉన్నారు.
సమాచారం తెలిస్తే వెంటనే అందించాలి : కలెక్టర్‌
రైలు ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా వారు ఎవరైనా వుంటే వారి వివరాలను కంట్రోల్‌ రూం నెంబర్‌ 8977935609కు ఫోన్‌ చేసి తెలపాలని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, విఆర్‌ఒల ద్వారా జిల్లాకు చెందిన వారి సమాచారం సేకరించాలని ఆర్‌డిఒ, తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు.

పెద్ద శబ్ధం వచ్చింది... ఏం జరిగిందో తెలీదు
మాది తాడేపల్లిగూడెం. నేను కలకత్తాలో ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాను. నేను షాలిమార్‌లో రైలు ఎక్కాను. బి4 ఎసి బోగీలో ఉన్నాను. రాత్రి 7.05 గంటల సమయంలో రైలు బనాడ్‌ గ్రామ సమీపానికి వచ్చేసరికి పెద్ద శబ్ధం వచ్చింది. బోగీ ఒకపక్కకు ఒరిగిపోయింది. నెమ్మదిగా బయటకు వచ్చి చూశాను. రైలు బోగిలు ఒకదానికి పైకి ఒకటి ఎక్కేసి ఉన్నాయి. ప్రయాణికులు హాహా కారాలు చేస్తున్నారు. ఆ సమయంలో నా కాళ్లూ చేతులూ ఆడలేదు. కొంత మందికి సాయం అందించాను. తరువాత రోడ్డు మార్గం గుండా వెళ్లి, మరో రైలులో రాజమండ్రికి వచ్చాను.
- ఉమామహేశ్వరరావు, తాడేపల్లి గూడెం
4రిజర్వేషన్‌ బోగీల్లో జిల్లా ప్రయాణికులు- 34 మంది
4కోరమాండల్‌లో ప్రయాణికులు - 31
4బెంగళూరు హౌరాలో ప్రయాణికులు - 3
4గమ్య స్థానాలకు చేరుకున్న వారి సంఖ్య - 27
4అందుబాటులోకి రాని ప్రయాణికుల సంఖ్య - 7
జనరల్‌ భోగీలో ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది.