May 10,2023 23:54

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రజలకు సుపరిపాలన అందజేతలో భాగంగా ప్రభుత్వాధికారులు సరళమైన వాడుక భాష తెలుగులోనే ప్రత్యుత్తరాలు జరపడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయ బాబు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాల అమలులో తెలుగు భాష అమలుపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ, మౌఖిక భాషను పాలనా భాషగా అమలు చేయడం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. మనం ఎక్కడ ఉన్నా ఆ బాధ్యతను నిర్వర్తించడం చాలా ముఖ్యం అన్నారు. తెలుగుభాష అమలు చేయాలన్న నిశ్చయం ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో తెలుగుభాషా ప్రాభవాన్ని సంస్కతిని ప్రతిబింబించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజమహేంద్రవరం తెలుగు భాషకు అమ్మలాంటిదని విజయబాబు పేర్కొన్నారు. మనకున్న అపూర్వమైన సంస్కతిని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. అధికార భాష అమలులో భాగంగా ప్రభుత్వం తెలుగు అమలు కోసం రూపొందించిన పలు ఉత్తర్వులను ఆయన వివరించారు. రానున్న రోజుల్లో కోర్టుల ద్వారా వచ్చే తీర్పులు స్థానిక భాషలో ముద్రించి ఇచ్చే అవకాశం కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వెళ్లి విన్నవిస్తామని చెప్పారు. డిఆర్‌ఒ జి.నరసింహులు మాట్లాడుతూ, స్పందన ఫిర్యాదుల విషయంలో నూరు శాతం తెలుగు అమలు చేస్తున్నామని, మిగిలిన వాటిని కూడా నూరుశాతం అమలు చర్యలు తీసుకుం టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎస్‌.మల్లిబాబు, ఎఎస్‌పి సిహెచ్‌.పాపారావు పాల్గొన్నారు.