ప్రజాశక్తి-కడియం అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం కడియం ఆవ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. తడిసిన, మొలకలెత్తిన ధాన్యాన్ని పరిశీలిస్తూ రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారాయని, క్లస్టర్ మిల్లింగ్ అంటూ కమీషన్ల కోసం ప్రభుత్వానికి కావాల్సిన మిల్లులకు ధాన్యాన్ని అమ్మమంటూ రైతులను వేధిస్తున్నారని చెపాపరు. రైతులు పండించిన ధాన్యాన్ని స్థానిక రైస్ మిల్లులకు కాక, సుదూర ప్రాంతాల రైస్ మిల్లులకు అమ్మమంటున్నారని, అక్కడ రైస్ మిల్లుల వారు దోపిడీ చేస్తుంటే వారితో ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా పలుమార్లు తడిసిన, మొలకలెత్తిన, బాతులు కూడా తినని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకు అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రధానంగా ఆవ ప్రాంత ముంపు సమస్యకు మేజర్ డ్రెయిన్ అవసరం ఉందని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తామన్నారు. రైతులు అధైర్య పడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టిస్తున్న సైకో ముఖ్యమంత్రిని సాగనంపాలని రైతులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడబోనని, రైతులకు అండగా నిలిచి జరుగుతున్న అన్యాయాలను, దోపిడీని ప్రభుత్వం దష్టికి తీసుకువచ్చి రైతులకు మేలు చేసేందుకే తాను వచ్చానని, సమయం తక్కువగా ఉందని, అన్ని విషయాలు కూలంకుషంగా తరువాత మాట్లాడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కడియం ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నందేవుల చంటి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కెఎస్.జవహర్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, చెల్లుబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.










