May 07,2023 22:58

తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న ప్రత్యేకాధికారి

ఆర్‌బికెలను పరిశీలించిన జిల్లా ప్రత్యేక అధికారి
ప్రజాశక్తి - రాజానగరం, కొవ్వూరు రూరల్‌
వర్షానికి తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని నిర్ధేశించిన మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా ప్రత్యేకాధికారి, సిఆర్‌కె కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, రాజానగరం మండలాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. కొవ్వూరు మండలం దొమ్మేరు, రాజానగరం మండలం కొత్త తుంగపాడు ఆర్‌బికెలను కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, జెసి తేజ్‌భరత్‌, వ్యవసాయాధికారులతో కలసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆర్‌బికె కేంద్రంలో ఏర్పాటు చేసిన తేమ శాతాన్ని నిర్థారించే యంత్ర పరికరం పనితీరును ప్రత్యేక అధికారికి కలెక్టర్‌కు తెలియజేశారు. తేమ శాతం విషయంలో రైతులకు భరోసా కల్పిస్తూ కొనుగోలు చేపడుతున్నామన్నారు. రానున్న రెండు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన కోతలు పూర్తయిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేకాధికారి వివేక్‌యాదవ్‌ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో దళారుల ప్రమేయం లేకుండా రైతులకు పూర్తి మద్దతు ధర అదించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో వర్షం సమయంలో పంట పొలాల్లో నీరు నిలిచిపోకుండా బయటకు వెళ్లేలా కాలువ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. దొమ్మేరులో రహదారి వెంబడి ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడారు. గన్ని బ్యాగులు సరఫరా, విరిగిన ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్ల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు ప్రత్యేక అధికారి దష్టికి తీసుక్చొరు. ఈ సందర్భంగా జెసి తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ, రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆఫ్‌ లైన్‌ ద్వారా కూడా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్‌డిఒ ఎస్‌.మల్లిబాబు, ఎ.చైత్ర వర్షిణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.మాధవరావు, డిస్‌ఒ పి.ప్రసాదరావు, సివిల్‌ సప్లయీస్‌ డిఎంవి. నాగార్జునరెడ్డి, ఇతర అధికారులు, రైతులు ఉన్నారు.