Mar 27,2023 22:34

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి పోలీసులు వాహనదారుల వెంటపడి మరీ చలాన్‌లు వేయడంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టార్గెట్‌ల కోసం పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ సెల్‌ఫోన్‌లలో ఫొటోలు తీయడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ చలాన్‌ల విషయంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో వాహనాల తనిఖీలు, చలాన్‌లు వేయడంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతుండగా మరికొన్ని చోట్ల తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
వాహనదారులు బెంబేలు
ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, వాహనదారులు కనీస భద్రత ప్రమాణాలు పాటించడం లేదంటూ ట్రాఫిక్‌ పోలీసులు, పోలీసులు విచ్ఛలవిడిగా చలాన్‌లను విధిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనల పేరుతో ఒక్కో వాహనదారుడికి వారంలో రెండుసార్లు, ఒక్కోసారి ఒకేరోజులో వివిధ చోట్ల రెండుసార్లు చలాన్‌లు పడిన సందర్భాలు అనేక ఉన్నాయి. రాజమహేంద్రవరం నగరంతో పాటు నగరానికి ఆనుకుని ఉన్న వివిధ మండలాల పోలీసులు తనిఖీలు, చలాన్‌లు వేస్తుండడంతో నగరంలో చలాన్‌ పడినవారికి ఆయా మండలాల పోలీసులు వేస్తున్న చలాన్‌లు కూడా పడుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు టార్గెట్‌లు, మండల పోలీసులకు టార్గెట్‌లు పైగా సెల్‌ఫోన్‌లలో ఫొటోలు తీస్తూ చలాన్‌లు వేస్తుండడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి వాహనదారులు పారిపోయే పరిస్థితి ఉందంటే పోలీసుల తీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.
సెల్‌ ఫోన్‌లో ఫోటోలు తీస్తూ
సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రిపుల్‌ రైడింగ్‌, రాంగ్‌రూట్‌లో వాహనం నడపడం, రోడ్డుపై పార్క్‌చేసిన వాహనాలకు చలాన్‌ వేయడం ఇలాంటి అంశాలలో పోలీసులు వాహనాలకు చలాన్‌లు వేయవచ్చు. కానీ ఇష్టారీతిన ఎక్కడపడితే అక్కడ సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తూ చలాన్‌లు వేయడం, బైక్‌తాళం లాక్కొని చలాన్‌లు వేయడం, వాహనాన్ని బలవంతంగా నిలిపి చలాన్‌లు వేయడంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి.
నగరంలో వెంటపడి మరీ..
రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్‌ పోలీసుల తీరు పట్ల వాహనదారులు విస్తు పోతున్నారు. లాలాచెరువు జంక్షన్‌ వద్ద నగరంలోకి వెళ్లే సర్వీస్‌ రోడ్డులో ఒకే వాహనం వెళ్లేలా బారికేడ్లు పెట్టి వాహనాలు ఆగగానే వాటిని తనిఖీ చేస్తూ ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌లు వేస్తున్నారు. ఇదివరకు ఒకరో ఇద్దరో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించి చలాన్‌లు వేయగా ఇప్పుడు ఐదారుగురు పోలీసులు ఒకేసారి వాహనదారుల వెంటపడి మరీ చలాన్‌లు విధిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ రోడ్డు, మెయిన్‌ రోడ్డు, గోకవరం బస్‌స్టాండ్‌ రోడ్‌, దేవీచౌక్‌ జంక్షన్‌, ఎవి.అప్పారావు రోడ్డు తదితర రద్దీ ఉన్న ప్రాంతాలనే ఎంపిక చేసుకుని పోలీసులు చలాన్‌లు వేస్తున్నారు. నగరంలో మార్కెట్ల వద్ద పార్కింగ్‌ చేసే స్థలాలు లేకపోవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలు పెట్టి పనులు చేసుకోవడం సహజంగా జరుగుతోంది. అదే అదునుగా పోలీసులు రాంగ్‌ పార్కింగ్‌ పేరుతో చలాన్‌లు విధిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారు.
తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు
దొంగలను పట్టుకున్నట్టుగా వాహనచోదకుల వెంట పోలీసులు పరుగులు పడుతున్నారు. పోలీసుల నుంచి తప్పంచుకునే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా తనిఖీలు చేయడం చలాన్‌లు వేయడం పోలీసుల విధి అయినప్పటికీ తనిఖీలు, చలాన్‌ల విషయంలో పారదర్శకత పాటించాలని అదేవిధంగా వాహనదారులపట్ల మర్యాదగా ప్రవర్తించాలని వాహనదారులు, సామాన్య ప్రజలు కోరుతున్నారు.