ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
స్వాతంత్య్ర సంగ్రామంలో కళాకారులు కీలక పాత్ర పోషించారని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిజిస్ట్రార్ డాక్టర్ జ్వాల ప్రసాద్ అన్నారు. భారత్ రంగ్ మహోత్సవ్ -2023లో భాగంగా బుధవారం 'శ్మశాన కురుక్షేత్రం' కన్నడ నాటికను ప్రదర్శించారు. నాటక ప్రదర్శన అనంతరం జ్వాలప్రసాద్ మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర సమర పోరాట సమయంలో ఆనాటి దేశ నాటక రంగ కళాకారులు పోషించిన పాత్ర ఎనలేనిదన్నారు. అటువంటి కళలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో స్థాపించనున్నారు. అందులో భాగంగా ఆనం కళాకేంద్రంలో భారత్ రంగ్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం కళాకారులకు జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో నిర్వహించే ఫెస్టివల్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ పి.వెట్రి భూపతి, బెంగళూరు ఎన్‌ఎస్‌డి సెంటర్ డైరెక్టర్ వీణ శర్మ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శ్మశాన కురుక్షేత్రం
బుధవారం ప్రదర్శిొచిన కన్నడ నాటకం 'శ్మశాన కురుక్షేత్రం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రపంచం గుర్తించిన మలయాళ కవి కువెంపు మహాభారత కురుక్షేత్ర యుద్ధపు భయంకర పరిణామాలను క్లుప్తీకరించి అద్భుతంగా నాటకాన్ని రచించారు. మహాభారతాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టగా కళాకారులు ఆవిష్కృతం చేశారు. మహాభారతంలో 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి ప్రతి ఒక్కరు తప్పక వినేవుంటారు. అక్కడో ఇక్కడో చదివి తెలుసుకుని ఉంటారు. ఈ భయంకరమైన యుద్ధం పరిణామాలను నాటకంలో ఆవిష్కరించారు. మహాభారత యుద్ధం, దాని పర్యవసానాలు, ప్రాణాలతో బయటపడినవారి బాధలు, పశ్చాత్తాపం, వేదన, ఆందోళన అందరినీ ఆలోచింపజేశాయి. యుద్ధం అనేది కులం, మతం, సంప్రదాయం, దేశాల మధ్య, ధనిక మరియు పేదల మధ్య వివిధ కోణాలను కలిగి ఉంటుంది. అన్నింటికంటే, యుద్ధం అనేది వ్యక్తి, వ్యక్తిత్వం మధ్య, మనస్సుల మధ్య జరిగే ఒక విషయం. 'శ్మశాన కురుక్షేత్రం' అనే ఈ నాటకంలో దీని గురించి సున్నితమైన చిత్రణ జరిగింది. కన్నడ కళాకారులు తమదైన శైలిలో అద్భుతం గా ప్రతి ఒక్కరు పాత్రాల్లో మమేకమై ఆనాటి కురుక్షేత్ర యుద్ధం అనంతరం జరిగిన సన్నివేశాలను ఎంతో అద్భుతం గా నాటకం లో ప్రదర్శించారు. ప్రధాన పాత్రల్లో తల్లిగా పూర్ణమ్మ, గాంధారిగా విద్య, కుంతిగా విద్యాలక్ష్మి, భీముడిగా అరుణ్ కుమార్, ధర్మరాజుగా రవిశంకర్, కష్ణుడిగా విశ్వనాథ్, సహదేవుడుగా అక్షరు కుమార్, ధతరాష్ట్రుడిగా మధు, అశ్వద్ధామగా ప్రకాష్, దుర్యోధనుడుగా పవన్ నటించారు. సవితా బైరప్ప దర్శకత్వం వహించగా రాఘవేంద్ర సంగీతం అందించారు.










