Apr 25,2023 23:03

సమావేశంలో పాల్గొన్న జెసి, కలెక్టర్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
సుస్థిర ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సుస్థిర ఆరోగ్య అభివృద్ధి లక్ష్యాల అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌తో కలిసి కలెక్టర్‌ విద్య, వైద్య మహిళా సంక్షేమ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 12,204 మంది గర్భిణులను గుర్తించామన్నారు. వీరికి రక్తహీనత లేకుండా పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రత్యేమైన చర్యలు చేపట్టాలని స్త్రీ, శిశుసంక్షేమం, వైద్యాధికారులను ఆదేశించారు. గర్భధారణ సమయంలో, పెరుగుతున్న పిండానికి, అలాగే తల్లికి తగినన్ని పోషకాలను, ఆక్సిజన్‌ అందించడానికి అనుగుణంగా అధిక స్థాయిలో రక్త ఉత్పత్తి అవసరం అన్నారు. గర్భధారణ సమయంలో తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్‌ 11 శాతంకు కంటే తక్కువ ఉండకుండా పోషక విలువులు ఉన్నా మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. జిల్లాలో తగిన వయస్సు కంటే బరువు తక్కువుగా ఉన్నవారు 2,760 మందిని, కుంగిపోయిన పిల్లలు 4,585 మంది గుర్తించమన్నారు. వీరిలో తీవ్ర అనిమియ లోపం కలిగిన వారికి వైయస్‌ఆర్‌ ప్రత్యేక పోషకతతో కూడిన పౌష్టికాహారం అందించాలన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా వైద్యులు ప్రతి నెలా పరీక్షలు నిర్వహించి వారికి ఎటువంటి పోషకారాన్ని అందించాలో సూచించాలన్నారు. వైద్యులు ప్రతి నెలా పరీక్షలు నిర్వహించడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటంతొ పాటు వారిలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుందన్నారు. మహిళా సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమనవ్యంతో గర్భిణిలకు రక్త హీనత లోపం వున్నా చిన్నారులను గుర్తించడంలో సంఖ్యాపరమైన అవగాహన ఉండాలన్నారు. ఈ దిశలో సచివాలయం పరిధిలో ఉన్న సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, వాలంటీర్‌ వారీగా ప్రత్యేక దష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌. తేజ్‌ భరత్‌, ఎల్‌ఏటిబి అధికారి డా ఎన్‌. వసుంధర, జిల్లా స్త్రీ శిశుసంక్షేమ అధికారి కె.విజయకుమారి, సిపిఒ ఎస్‌.ప్రకాశరావు, డిఇఒ ఎస్‌.అబ్రహాం, డిఎల్‌డిఒ పి.వీణాదేవి తదితరులు పాల్గొన్నారు.