Apr 27,2023 23:32

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం స్థానిక ఉత్పత్తులపై జిఎస్‌టి కౌన్సిల్‌ ద్వారా ఎన్నో వెసులుబాట్లు తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో వాణిజ్య సంస్థల ప్రతినిధులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వేణుగోపాలకష్ణ, హోమ్‌ శాఖ మంత్రి తానేటి వనితలతో కలిసి బుగ్గన సమావేశంలో పాల్గొన్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి చింతపండుపై జిఎస్‌టిని మినహాయించాలనే ప్రతిపాదనలపై అనేక విధాలుగా పరిశీలన, పరిశోధన చేశామన్నారు. నిత్య ఆహార తయారీలో భాగమైన చింతపండుపై పన్ను మినహాయించడంలో విజయం సాధించామన్నారు. మామిడిపండు, గుజ్జు, ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ సహా అనేక స్థానిక ఉత్పత్తులపై పన్ను మినహాయింపులు, సంస్కరణలు, పన్ను తగ్గింపులు, సవరణలు, ఫిట్‌ మెంట్‌ సాధించుకున్నది దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని అన్నారు. మూడేళ్లలో చేసిన కసరత్తు, కషి వాణిజ్యవేత్తల పట్ల ప్రభుత్వ స్నేహపూర్వక శైలి ఇందుకు నిదర్శనం అన్నారు. పన్నులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల పరిష్కారంలో ఎపి ముందంజలో ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇటీవల పన్నుల విధానం, సంస్కరణలపై చేసిన ప్రజంటేషన్‌ చూసి ఆంధ్రప్రదేశ్‌ పనితీరులో అన్ని రాష్ట్రాల కన్నా బాగుందని కేంద్ర ఆర్థిక శాఖ మెచ్చుకుందని తెలిపారు. అధికారుల తప్పిదాల ప్రభావం లేకుండా ఎపి అభివద్ధి చేసిన టూల్‌ యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ట్రెజరీ అడ్వైజరీ కమిటీ నిర్వహణ, మానవ తప్పిదాలపై స్పందన, అధికారులకు శిక్షణ లేకపోవడం వల్ల వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
ట్రేడ్‌ అడ్వైజరీ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వ్యాపారులకు తలెత్తే ఇబ్బందులను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. డిపార్ట్‌మెంట్‌కు డీలర్‌కు మధ్య మంచి సంబంధాలుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పన్ను ధరలు, విధానాలు కౌన్సిల్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పన్నుల అమలు విషయంలో డీలర్‌ ఫ్రెండ్లీగా ఉండాలనేదే సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయమని పేర్కొన్నారు.
వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్‌ గిరిజా శంకర్‌ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని 'మోడల్‌ ఎనలిటిక్స్‌ సిస్టం' ఎపిలో ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలగని విధంగా వాణిజ్యవేత్తలు, పన్నుదారులకు ఇబ్బందలేని వ్యవస్థను నెలకొల్పామన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డేటా ఎనలిటిక్స్‌ వింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటి టూల్స్‌ సహకారంతో అధిక పన్నులు, మినహాయింపులు లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని వినియోగించుకుంటూ గతేడాది కాలంలో అనవసర ఇబ్బందులు లేకుండా పన్నుదారులకు ఉపశమనం కలిగించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ వంగా గీత, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు.