ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి గ్రామస్థాయిలో రాజ్యాంగ పదవులు అలంకరించిన సర్పంచులకు తమకు పాలనా వ్యవహరాల్లో తగిన ప్రాధాన్యత ఉండడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలు సర్పంచుల అధికారాలను కాలరాసిన విషయం విదితమే. తాజాగా వాలంటీర్ల జోక్యం మరింత రెట్టింపయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక ప్రక్రియ బాధ్యతలను వాలంటీర్లకు అప్పజెప్పడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో వాలంటీర్లు అధికార పార్టీకి చెందిన వారే ఉండడంతో సర్పంచులకు చుక్కెదురవుతోంది. దీంతో సర్పంచులు ఇరుకున పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన వారే కావడంతో రాజీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక సంఘం నిధులు పైన సర్పంచుల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. మొత్తం మీద తమ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారాయని అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది.
అధికార పార్టీలో అసంతప్తి
పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ మద్దతు దారులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్నికలకు ముందే జిల్లావ్యాప్తంగా వాలంటీర్ల నియామకం చేపట్టింది. అప్పటికే ఆమె సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక ప్రక్రియలో వాలంటీర్లు కీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఏ పనికైనా ప్రజలు కూడా వాలంటీర్లనే సంప్రదిస్తున్నారు. సంక్షేమ పథకాలకైనా సమస్యల పరిష్కారానికైనా, అర్హత సర్టిఫికెట్ల కోసం వారినే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా వాలంటీర్ల సేవలే పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న తామెందుకు అని సర్పంచులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. కేంద్రం అందించే నిధులను పక్క దారి పట్టిస్తోంది. విధులు, హక్కులను హరిస్తోంది'.. అంటూ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే తమ బాధను వెళ్లగక్కుతున్నారు. కొన్ని చోట్ల విపక్ష సర్పంచ్‌లతో కలిసిన అధికార పక్షం వారు సైతం గొంతు కలపడం పరిపాటిగా మారింది.
అలంకారప్రాయంగా సర్పంచ్ పదవి
జిల్లావ్యాప్తంగా 300 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్ పదవులు రోజురోజుకి అలంకారప్రాయంగా మారుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు, తాజాగా వాలంటీర్లు నియామకాలు సర్పంచుల అధికారాలను కాలరాస్తున్నాయి అని చెప్పవచ్చు. వాలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్, ఎంపిక ప్రక్రియ కానీ దశలవారీగా జరిగినప్పటికీ అధికార పార్టీ వారినే నియమించారన్నది బహిరంగ రహస్యం. ఈ ఏడాది మార్చిలో పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో సర్పంచులు కొలువుదీరారు. కానీ నిధులు లేకపోవడం, అంతా సచివాలయ కార్యాలయాల కనుసన్నల్లో జరగడం, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు నిలవడంతో సర్పంచులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు అందించే ఆర్థిక సంఘం నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ప్రజలు అడుగుతున్న ఏ చిన్న పనీ చేయలేని స్థితిలో ఉండడంతో సర్పంచుల్లో నిర్వేదం పెరుగుతోంది. ప్రజలకు ఏదో చేయ్యాలని ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే ఏమిటీ పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రజల్లో పలుచనైపోతు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సంస్థల బలోపేతం అంటే ఇదేనా...?
ఎన్నికల ముందు స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం నిధులు మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు ఒక్కో అధికారాన్ని దూరం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి పదవులు ఉత్సవ విగ్రహాలన్న వ్యాఖ్యలు ఉండేవి. ఇప్పుడు అదే కోవలోకి సర్పంచులు చేరుతున్నారు. పంచాయతీ ప్రథమ పౌరుడుగా ఆ పదవికి విశేష అధికారాలు ఉండేవి. రాజ్యాంగబద్ధంగా హక్కులు, విధులు, నిధులు ఉండేవి. కానీ ఒక్కొక్కటీ ప్రభుత్వాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. సర్పంచులకు సమాంతరంగా వ్యవస్థలను తెచ్చిపెట్టి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి. దేశ ప్రధాని అయినా, రాష్ట్రానికి సిఎం అయినా గ్రామ పంచాయతీల్లో పర్యటించేటప్పుడు ప్రోటోకాల్ ప్రకారం తొలుత సర్పంచ్‌కు ఆహ్వానం అందించాలి. అందుకే దశాబ్దాలుగా సర్పంచ్ పదవులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వైసిపి విధానాల వల్ల గత ప్రాధాన్యతలు మసకబారుతున్నాయి.










