May 10,2023 23:34

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో పంచాయతీలను నిధుల లేమి వెంటాడుతోంది. కనీసం నిర్వహణ ఖర్చులు లేక సతమతమవుతున్నాయి. వచ్చే నిధులు రాకపోవడం, ఉన్న నిధులను ప్రభుత్వం మళ్లిస్తుండడంతో పంచాయతీల్లో నిధుల కొరత ఏర్పడుతోంది. కనీసం పన్నులు పంచాయతీలకు జమకాని పరిస్థితి నెలకొంది. దీంతో చిన్నపాటి పనులు కూడా చేయడానికి నిధుల్లేక సర్పంచ్‌లు చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో పాలన కుంటుపడుతోంది. గతంలో పంచాయతీల్లో వేసవి కాలం సమయంలో మోటార్లు, చేతి పంపుల మరమ్మతులు, చిన్న చిన్న రహదారులు నిర్మాణం వంటి పనులకు పంచాయతీ నిధులను వినియోగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. మరో వైపు పంచాయతీలకు సచివాలయాల నిర్వహణ అదనపు భారంగా మారింది. దీనికి తోడు విద్యుత్‌ బిల్లులు చెల్లింపు పంచాయతీలకు భారంగా తయార య్యింది. జిల్లాలో పం చాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా మారు తోందని సర్పంచ్‌లే చెబు తున్నారు. తాము సర్పంచ్‌లుగా ఎన్ని కౖనా పనులు చేయడానికి నిధులు లేమి, మరో పక్క అధికారాలు అం తంత మాత్రంగా ఉండడంతో పాలన కష్ట తరంగా మారిందని వాపో తున్నారు. పంచా యతీలకు ఆసరాగా నిలిచే ఆర్థిక సంఘ నిధులు విద్యుత్‌ బిల్లులకు జమ చేస్తుండడంతో పంచాయతీల్లో నిధుల లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
పంచాయతీలపై అదనపు భారం..
జిల్లాలో 300 పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో నిర్వహణ భారంగా పరిణమించింది. గతంలో బిల్లు కలెక్టర్లు ఉండడంతో పంచాయతీల్లో విధించే పన్నులను వారు వసూలు చేసే వారు. ఆ నిధులతో అభివద్ధి పనులు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నా నిర్వహణకు మాత్రం నిధులు లేక పంచాయతీలు దిక్కులు చూస్తున్నాయి. పైగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పంచాయతీలపై భారం పెరిగింది. కనీసం మంచినీటి సరఫరాకు నిధులు రాక పంచాయతీలే చేతి పంపులు, పైప్‌లైన్లు మరమ్మతులు చేయించుకుంటున్నాయి. మరోవైపు పాలనా పరంగా సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. స్టేషనరీ ఖర్చులు పంచాయతీలే భరించాల్సిన పరిస్థితి. సచివాలయాలకు ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లుకు సంబంధించిన బిల్లులను పంచాయతీ నిధుల నుంచి చెల్లించాల్సి రావడంతో పంచాయతీ పాలక వర్గాలు, కార్యదర్శులు సతమతం అవుతున్నారు. కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య పనివారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరస్థితులను ఎలా అధిగమించాలో అర్థం కాని పరిస్థితుల్లో పాలకవర్గాలు ఇబ్బంది పడుతున్నాయి.
పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
పంచాయతీల్లో చేసే చిన్నపాటి అభివద్ధి పనులకూ నిధులు లేక కాంట్రాక్టర్లు పనులు చేయ డానికి ముందుకు రావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీల్లో వీధి దీపాలు రిపేరుకు వస్తే మార్చలేని పరిస్థితి. పారిశుధ్య నిర్వహణకు నిధులు అంతంత మాత్రంగానే ఉండడంతో గ్రామాల్లో పారిశుధ్యం కుంటుపడింది. ఆర్థిక సంఘ నిధులతో పాటు పంచాయతీలకు వచ్చే పలు రకాల నిధులను ప్రభుత్వం మళ్లించడంతో పంచాయతీలు నిర్వీర్యం అవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. పాలక ప్రభుత్వాలు ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని పాలకవర్గాలు కోరుతున్నాయి.