పజాశక్తి - గోపాలపురం గ్రామాల్లో నెలకున్న సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజాప్రతినిధులు గళమెత్తారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సివుంది. అయితే పాలకవర్గంలోని ముగ్గురు సభ్యులు మినహా ఎంపిపితో సహా ఇతర సభ్యులు సకాలంలో హజరుకాకపోవడంతో 3.15 గంటలకు సమావేశపు హాలుకు చేరుకున్న ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావుకు పరిస్థితిని చూసి అసహనంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. అనంతరం ఎంపిపి అధ్యక్షతన 11 మంది ఎంపిటిసి సభ్యులు, 4 సర్పంచులతో సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో సుమారు 27 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొనాల్సివుండగా, 19 శాఖలకు చెందిన వారు మాత్రమే పాల్గొన్నారు. ఇందులో కొందరు అధికారులు అయితే, మరికొందరు సిబ్బంది పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా చిట్యాల ఎంపిటిసి సభ్యులు బూసి దేవీశ్వరి, కరిచర్లగూడెం సర్పంచ్ ఆన్సర్ భాష, సంజీవపురం సర్పంచ్ ఇళ్ళ శ్రీరామమూర్తి, వేల చింతలగూడెం సర్పంచ్ గోళ్ల దండియ్య, తదితరులు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం ఉండటం లేదన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా చేస్తున్న కరెంటు కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొం టున్నారని ఆవేదన వ్యక్తం చేశాఉరు. వేలచింతలగూడెంలో నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన నేటికీ వైర్లు మార్చలేదని, ఫలితంగా ఇంటి నిర్మాణం ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్యాలలో జగనన్న కాలనీలో విద్యుత్ సర్వీసును ఏర్పాటు చేయకపోవడంపై విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. అధికార పార్టీలో ఉన్నామో లేక ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గం సమావేశంలో ఎంఎల్‌ఎ లేకపోతే మా సమస్యను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదని, ఎంఎల్‌ఎ సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎంపిడివి ఆర్.శ్రీదేవిని కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపిపి వంగా నారాయణమ్మ, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.










