May 07,2023 00:45

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రైతులు పోరుబాటలో భాగస్వాములు కావాలని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు చేపట్టిన పర్యటన శనివారం మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారం రాత్రి బివిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బస చేసిన చంద్రబాబు శనివారం ఉదయం రోడ్డు మార్గాన కొవ్వూరు మీదుగా చాగల్లు మండలంలోని చాగల్లు గ్రామం, నందిగంపాడు, ఊనగట్ల, ఎస్‌.ముప్పవరం, బ్రాహ్మణగూడెంలో ఉదయం పర్యటించారు. మధ్యాహ్న భోజనం అనంతరం గణేష్‌ చౌక్‌, తిమ్మరాజుపాలెం, కాటకోటేశ్వరం, అనంతరం సమిశ్రగూడెం చేరుకున్నారు. రైతులు తమ ఇబ్బందులను చంద్రబాబుకు ఒకొక్కరుగా వివరించారు. తడిసిన వరి ధాన్యాలను చంద్రబాబు పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోకుంటే కోలుకోలేమని రైతులు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమిశ్రగూడెంలో రైతులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం 72 గంటల్లో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. తుపాను హెచ్చరిక నేపధ్యంలో అప్రమత్తం కావల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉదని గుర్తు చేశారు. గతంలో పంటలకు ఇన్సూరెన్స్‌ చేసేవాళ్లమని, రాష్ట్ర ప్రభుత్వం, రైతు, కేంద్రం కలిసి ఇన్సూరెన్స్‌ చెల్లించేదని అన్నారు. ఈ రోజు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ తీసేశారని మండిపడ్డారు. నాడు అసెంబ్లీలో ఇలాగే ఇన్సూరెన్స్‌ కట్టకుండా కట్టాను అని చెప్పారని తెలిపారు. ఆనాడు అసెంబ్లీలో పోడియం వద్ద కూర్చుని నిరసన చేశాననని, అప్పుడు రాత్రికి రాత్రి డబ్బు కట్టారని గుర్తు చేశారు. ఈ రబీ పంటకు ఇన్సూరెన్స్‌ కట్టి ఉంటే రైతులకు కాస్త భరోసా లభించేదని అన్నారు. గోదావరి జిల్లాల్లో 40 నుంచి 50 శాతం పంట ఇప్పటికీ పొలాలు, కళ్లాల్లో ఉందని అన్నారు. ధాన్యం తడిసి, పంట నీట మునిగి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందన్నారు. తాను పర్యటనకు రావడంతో హడావుడిగా కొనుగోలు ప్రారంభించిందని, ఈ కొనుగోలులోనూ నిర్ధిష్టత కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతుల్లో దేశంలో ఎపి రెండో స్థానంలో ఉందని, కౌలు రైతుల్లో ఎక్కువ మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసిలేనని జగన్‌ వారిని పొట్టనపెట్టుకుంటున్నారని అన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు బూరుగపల్లి వీర్రాఘవులు, నాదెళ్ల శ్రీరాం చౌదరి (నాని), బొల్లిన శివనాగేంద్ర, ఆళ్ల హరిబాబు పాల్గొన్నారు.