Aug 15,2023 23:51

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌
ధనమేరా అన్నిటికీ మూలం.. అనేది పాత సామెత..'చదువే రా అన్నిటికి మూలం అనేది కొత్త సామెత. ఈ సామెతను నిజం చేసింది. రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరం గ్రామానికి చెందిన కొటికెలపూడి శ్రీసాయిశ్రావ్య. నిర్దిష్టమైన ప్రణాళిక, కష్టపడే తత్వం ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలైన ఆలవోకగా అందుకోవచ్చని నిరూపించింది ఈ విద్యాకుసుమం. శ్రావ్య శ్రీ విష్ణు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఫర్‌ ఉమెన్‌లో సిఎస్‌ఇలో బిటెక్‌ను 2023 సంవత్సరానికి 9.44 సిజిపిఎతో పూర్తి చేసింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ మల్టీ నేషనల్‌ కంపెనీలో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొంది. సత్తా చాటి రూ.32.57 లక్షల వేతనంతో కూడిన కొలువును సొంతం చేసుకుంది. ఇంత అత్యధిక వేతనంతో కొలువు రావడం పట్ల విష్ణు ఇంజినీరింగ్‌ మహిళా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. శ్రావ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రావ్య తండ్రి కెఎస్‌ఎస్‌.రాజారావు సూర్య తెలుగు దినపత్రిక ఎపి రీజినల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి శ్రీరమణి సంధ్య గృహణి. వీరి పెద్ద కుమార్తె అయిన శ్రావ్య చిన్నతనం నుంచి చదువులో రాణించింది. రాజమహేంద్రవరంలో శ్రీగౌతమి స్మార్ట్‌ స్కూల్‌లో పదోతరగతి వరకూ చదివింది. పదో తరగతిలో పదికి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించింది. అనంతరం తిరుమల జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ 983 మార్కులతో పూర్తి చేసింది. జెఇఇ మెయిన్స్‌లో 92.07 పర్సంటైల్‌తో రాణించింది. ఫ్లిప్‌ కార్ట్‌లో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని, విద్యాబుద్ధులు నేర్పించిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపింది. బీటెక్‌ కోర్సులో భాగంగా వైజ్‌ ప్రోగ్రాం, సి అండ్‌ డాటా స్ట్రక్చర్స్‌ ప్రోగ్రాం వల్ల ఇంత మంచి ఉద్యోగం వచ్చిందని తెలిపింది.