ప్రజాశక్తి - ధవళేశ్వరం, కడియం
కడియం ఎంపిడిఒ రత్నకుమారి కుమారుడు సందీప్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ధవళేశ్వరంలోని అఫీషియల్ కాలనీలో ఎంపిడిఒ స్వగృహం వద్ద సందీప్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చియ్యచౌదరి సందీప్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన సందీప్ మరణం బాధాకరమన్నారు. ఎంపిడిఒను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. సందీప్ అంత్యక్రియలు ఆదివారం కొవ్వూరులో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎంపిడిఒను పలువురు పరామర్శించి ఓదార్చారు. పరామర్శించిన వారిలో టిడిపి నాయకులు అన్నందేవుల చంటి, వెలుగుబంటి నాని, ప్రత్తిపాటి రామారావుచౌదరి, చెల్లబోయిన శ్రీనివాసు, ఉమ్మడి దేవి, ఎంఇఒ లజపతిరారు, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ చందర్రావు, పలువురు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.
సందీప్ మతిపై విచారణ జరపాలి : స్టాలిన్
కడియం ఎంపిడిఒ కుమారుడు సందీప్ మృతిపై విచారణ జరపాలని జేగురుపాడు సర్పంచ్, న్యాయవాది స్టాలిన్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నగరంలో వైద్యం వ్యాపారంగా మారిందన్నారు. పుట్టగొడుగుల్లా వెలిసిన వైద్యాలయాలు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబులు, బ్లెడ్ బ్యాంకుల్లో చాలా వాటికి అనుమతులు, ప్రామాణికత లేవన్నారు. ఉజ్వల భవిష్యత్ కల్గిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మట్టా సందీప్ లాంటి యువకుడు మృతి చెందడం చాలా బాధను కలిగిస్తుందన్నారు. గ్యాస్ట్రో సంబంధిత చిన్నపాటి సమస్యతో చేరిన సందీప్ మృతి చెందాడని స్టాలిన్ చెప్పారు. ఇది సాధారణ మరణంగా పరిగణించడం తగదని అతని మతిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.










